మరో కీలక అంతర్జాతీయ సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవ్వాలని కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.
ఈ సదస్సుకు చైనాలోని టియాంజిన్ వేదిక కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక మండలి అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపారు. కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో తెలంగాణ దూసుకెళ్తోందని బోర్గె ప్రసంశించారు. కాగా, గతంలో కూడా మంత్రి కేటీఆర్‌కు పలు అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానాలు వచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ సందేశం ఇచ్చారు. నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు.. తెలంగాణ ప్రజలకు సైతం గర్వకారణం.
ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పని చేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా.. ఇప్పుడు దశాబ్దాలుగా దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టింది అని కేటీఆర్ తెలిపారు.
ఉద్యమ పాఠాల నుంచి మొదలుకుని, యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ఈ మహా ప్రస్థానంలో బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమే. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications