Year Ender 2024: ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన 2024
భారత రాష్ట్ర సమితి (BRS)ను 2024 సంవత్సరం చాలా పెద్ద ఆటు పోట్లతో కుదుపేసింది. నిజానికి 2023 చివరలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారం చేపడతామని భావించిన బీఆర్ఎస్ అధిష్టానానికి ఫలితాలు మాత్రం అనూహ్యంగా భారీ షాకిచ్చాయి.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో తెలంగాణలో మెజార్టీ మార్క్ దాటి అధికారంలోకి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు, 39 స్థానాల్లోనే గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది. 2023 చివరలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన బీఆర్ఎస్ కష్టాలు 2024 ఏడాది మొత్తం కొనసాగాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి జైకొట్టారు. కొందరు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరికొందరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి దూరమైనట్లు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అటు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు అసెంబ్లీ స్పీకర్‌పైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. కానీ, ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు.
ఇది ఇలావుంటే.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర నిరాశలోకి నెట్టేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం శోచనీయం. ఇక, ఉపఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ హవా ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇలాంటి ఫలితాలు చూడకపోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పార్టీ అధినేతతోపాటు పార్టీ శ్రేణులను కూడా తీవ్ర నిరాశకు గురిచేశాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఫలితాల తర్వాత మరికొందరు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కే కేశవరావు లాంటి సీనియర్ నేతలు కూడా కేసీఆర్ పార్టీని వీడారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం ఆ పార్టీకి తాకిన మరో పెద్ద షాక్. ఆమె తీహార్ జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కిందపడటంతో కేసీఆర్ తొంటి ఎముక విరగడంతో వైద్యులు ఆయనకు చికిత్స చేసి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో కేసీఆర్ కొద్ది నెలలు నివాసానికే పరిమిమయ్యారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఒసారి మాత్రమే హాజరయ్యారు. ఒకటి రెండు సార్లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు కావడం గమనార్హం. మొత్తంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని 2024 అతిపెద్ద కుదులతో ఢీకొట్టి పార్టీ పెద్దలను విధానాల అమలు విషయంలో పునరాలోచనలో పడేసింది.












Click it and Unblock the Notifications