హైకోర్టులో అశోక్ కు చుక్కెదురు .. నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
హైదరాబాద్ : తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోన్న ఐటీ గ్రిడ్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులపై ఐటీ గ్రిడ్ ఎండీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అశోక్ కు చుక్కెదురు
ఐటీగ్రిడ్ డేటా కేసుకు సంబంధించి హైకోర్టులో అశోక్ కు చుక్కెదురైంది. ఆయన తరఫు న్యాయవాది లేవనెత్తిన అంశాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఐటీ గ్రిడ్ కేసును కొట్టివేయాలని, అశోక్ కు నోటీసులు ఇవ్వడం ఏంటని అశోక్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే డేటా ఏపీకి సంబంధించినందున కేసును అక్కడికి బదిలీ చేయాలని విన్నవించినా ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది.

నోటీసులకు సమాధానం ఇవ్వండి
అశోక్ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సిట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాలని సిట్ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. తెలంగాణ కేంద్రంగా ఐటీ గ్రిడ్ కార్యకలాపాలు జరిగినందున హైదరాబాద్, సైబరాబాద్ లో రెండు కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. ఈ మేరకు సిట్ నోటీసులు జారీచేసిందని సమాధానం ఇవ్వాలని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిట్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అశోక్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదావేసింది.












Click it and Unblock the Notifications