వరంగల్లో కడియంపై చెప్పులు విసిరిన రైతు, కుట్రనా?: 16 నుంచి జగన్ ప్రచారం
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి శాయంపేట మండలంలో శుక్రవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి దయాకర్ తరఫున కడియం ప్రచారం చేస్తున్నారు.
ఆయన శాయంపేట మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార సభలో కడియంతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కడియం ప్రసంగిస్తున్న సమయంలో ఓ రైతు ఉప ముఖ్యమంత్రి పైకి చెప్పు విసిరారు. అతనిని టిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు పట్టించారు.
తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండిపడుతూ సదరు రైతు చెప్పులు విసిరారు. అతను పత్తి రైతు అని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పైకి చెప్పులు విసిరిన నేపథ్యంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చెప్పులు విసిరిన వ్యక్తి పేరు సాయిలు అని తెలుస్తోంది.

కాగా, కుట్రపూరితంగా, ఉద్దేశ్యపూర్వకంగా ఈ దాడి జరిగిందని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, రైతులు కెసిఆర్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందులో భాగంగానే ఈ దాడి జరిగిందని ఇంకొందరు అంటున్నారు.
వరంగల్లో జగన్ ప్రచారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు. జగన్ ఈ నెల 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారం చేస్తారు.
రాజయ్య పైన కాంగ్రెస్ వేటు?
కోడలు సారిక, మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో జైలుకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాజయ్య పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చునని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications