సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో అద్భుత సినీశకం ముగిసింది.. వైఎస్ జగన్, చంద్రబాబుతోపాటు పలువురి నివాళి!!

తెలుగు సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు సినిమా ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు మాత్రమే కాదు సినీలోకం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మృతి యావత్ సినిమా ప్రపంచానికే కాకుండా, అటు రాజకీయ నాయకులకు కూడా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

మనసున్న మనిషి, ఆయనే అల్లూరి.. కృష్ణగారి మరణం తీరని లోటు: వైఎస్ జగన్


సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు అని పేర్కొన్నారు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మరణంతో అద్భుత సినీశకం ముగిసినట్లయింది: చంద్రబాబు


సూపర్ స్టార్ కృష్ణ మృతి పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. కృష్ణ మృతి పై స్పందించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్వీట్ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారని పేర్కొన్నారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

ఇంధ్రధనుస్సు పల్లకీ ఎక్కి దివికేగిన విహారి కృష్ణ: టీడీపీ నివాళి

తెలుగుదేశం పార్టీ ట్విటర్ ఖాతా లోనూ సూపర్ స్టార్ కృష్ణ మృతికి నివాళులర్పించారు. "సంకల్పం నాకు ధనము,సాహసమే నాకు బలం " అని ఒక పాటలో అన్నట్టుగా... నాలుగు దశాబ్దాల తన సినిమా జీవితంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక సాహసవంతమైన ప్రయాణాన్ని ముగించుకుని ఇంధ్రధనుస్సు పల్లకీ ఎక్కి దివికేగిన విహారి కృష్ణ గారికి అశ్రు నివాళులర్పిస్తోంది తెలుగుదేశం పార్టీ అంటూ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణం దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఏపీ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినిమా ప్రపంచానికి తీరని లోటని, ఘట్టమనేని కుటుంబానికి భగవంతుడు గుండె నిబ్బరం ఇవ్వాలని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సూపర్ స్టార్ అభిమానులకు, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకి కృష్ణ గారి మరణం తీరని లోటుగా పేర్కొన్న రోజా వారి ఆత్మకు శాంతి కలగాలని టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కృష్ణ గారి మరణం తెలుగు సినిమాకీ, తెలుగుజాతికి తీరని లోటు: వైఎస్ షర్మిల

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్పందించారు. కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినిమాకి నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా విశిష్ట సేవలు అందించి, కొత్తదనం దిద్దిన సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం అద్వితీయం అంటూ ఆయన సేవలను కొనియాడారు. అయన మృతి తెలుగు సినిమాకీ, తెలుగుజాతికి తీరని లోటు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+