చరిత్ర తెలీకుండా మొరుగుతున్నావ్ నిరంజన్ రెడ్డి; నన్ను ఎవడ్రా అడిగేది: వైఎస్ షర్మిల నిప్పులు!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సాగిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంత్రి నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అని చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎవడ్రా నీకు మరదలు అంటూ రెచ్చిపోయిన వైయస్ షర్మిల, నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నిరంజన్ రెడ్డి పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిరంజన్ రెడ్డి తనదైన శైలిలో మండిపడ్డారు. ఇక వదిలిపెట్టని షర్మిల మరోమారు మంత్రిని టార్గెట్ చేశారు.

చీల్చి చెండాడతాం జాగ్రత్త .. షర్మిలకుమంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్
అహంకారంతో మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో చీల్చిచెండాడతామని మంత్రి నిరంజన్ రెడ్డి వైయస్ షర్మిల ను టార్గెట్ చేశారు. మాటలు చెప్పడం కాదు రాజన్న బిడ్డ అయితే రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక మాటకు వంద మాటలు అంటామని హెచ్చరించారు. నీ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదాయపన్ను కట్టకముందే న్యాయవాదిగా పన్ను కట్టిన వాడిని అని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని, వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించిన చరిత్ర తనదని పేర్కొన్నారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారుడిని అని చెప్పుకున్నారు. ఇక రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ వైయస్ షర్మిల పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు నిరంజన్ రెడ్డి.

వైఎస్సార్ చరిత్ర తెలియకుండా మొరుగుతున్నారు: నిరంజన్ రెడ్డికి షర్మిల కౌంటర్
ఇక తాజాగా మరోమారు నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో నిప్పులు చెరిగారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఒక వీధి కుక్క అంటూ మళ్ళీ మండిపడ్డారు. వైయస్ఆర్ చరిత్ర తెలియకుండా మొరిగితే.. అబద్దం నిజం కాదు అంటూ మండిపడ్డారు. వైయస్ఆర్ మరణిస్తే 700 మంది గుండెలు ఆగిపోయాయి. ఇకనైనా సిగ్గు, ఇంగితం, బుద్ధి తెచ్చుకుని వైయస్ఆర్ లా జీవించు అంటూ హితవు పలికారు వైయస్ షర్మిల.

కేసీఆర్ ప్రజలకే కాదు తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు: వైఎస్ షర్మిల
ఇక ఇదే సమయంలో కెసిఆర్ ను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల కేసీఆర్ ప్రజలకే కాదు తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు అంటూ ఆరోపించారు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచాడు. బంగారు తెలంగాణ అయ్యింది కేసీఆర్ కుటుంబానికి, ఎమ్మెల్యేలకు మాత్రమే అంటూ నిప్పులు చెరిగారు. ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారం అని పేర్కొన్నారు వైయస్ షర్మిల. ప్రతి ఒక్కరి బాధలు వింటాం. వెన్ను తట్టి భరోసా కల్పిస్తాం. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరువ్యాపారులకు అండగా ఉంటాం అంటూ వైఎస్ షర్మిల వెల్లడించారు.
ఎవడ్రా అడిగేది నన్ను ...షర్మిల ఆగ్రహం
అంతేకాదు తనను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అభివర్ణించడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇక్కడ పెరిగానని, ఇక్కడ చదువుకున్నా అని, ఇక్కడ పెండ్లి చేసుకున్న.. నా బతుకు ఇక్కడే.. నా భవిష్యత్తు ఇక్కడే.. అలాంటప్పుడు ఇది నా తెలంగాణ కాకుండా ఎట్లవుతది? అని ప్రశ్నించారు. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత కాదా? ఎవడ్రా అడిగేది నన్ను? అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల. మొత్తానికి మంగళవారం మరదలు వ్యాఖ్యలపై మొదలైన రచ్చ వైయస్ షర్మిలకు, మంత్రి నిరంజన్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.












Click it and Unblock the Notifications