• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైఎస్ షర్మిల అనుచరులకు కరోనా... ఐసోలేషన్‌లో కొండా రాఘవరెడ్డి,ఆస్పత్రిలో చేరిన మరికొందరు...

|

ఖమ్మంలో ఈ నెల 9న వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభకు హాజరైనవారిలో... కొంతమంది ఆమె అనుచరులు కరోనా బారినపడ్డారు. ఇందులో షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి కూడా ఉన్నారు. కరోనా బారినపడ్డ షర్మిల అనుచరుల్లో కొందరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. షర్మిల అనుచరులకు కరోనా సోకిందని తెలియడంతో ఖమ్మం సభలో వారిని కలిసినవారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 9న ఖమ్మం సభ జరగ్గా... అంతకు వారం రోజుల ముందే కొండా రాఘవ రెడ్డి అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సభ ముగిసిన మరుసటి రోజు ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం షర్మిల దీక్షా శిబిరంలో కొండా రాఘవరెడ్డితో పాటు మరికొందరు అనుచరులు కనిపించట్లేదు.

ys sharmila close aide konda raghava reddy and others tested coronavirus positive

మరోవైపు ప్రస్తుతం వైఎస్ షర్మిల రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని తన నివాసం లోటస్‌పాండ్ వేదికగా ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో గురువారం(ఏప్రిల్ 15) ఇందిరా పార్క్ వద్ద ఆమె నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నిజానికి నిన్న సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పోలీసులు దీక్షకు అనుమతినిచ్చారు. అయితే అనూహ్యంగా తన దీక్షను 72 గంటలకు పొడగిస్తున్నట్లు షర్మిల సంచలన ప్రకటన చేశారు.

ఇందిరా పార్క్ సమీపంలోని దీక్షాస్థలి నుంచి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు ఆమెను,అనుచరులను అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల సొమ్మసిల్లిపోగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం లోటస్‌పాండ్‌లోని నివాసానికి తరలించారు.

అప్పటినుంచి షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. అంతకుముందే ఆమె దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. తనను ఎక్కడికి తరలించినా సరే దీక్ష విరమించేది లేదని చెప్పారు. చెప్పినట్లుగానే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యంపై అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నిరాహార దీక్ష తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామని షర్మిల ప్రకటించారు. నిన్నటి దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె ఘాటైన విమర్శలు చేశారు. చందమామ లాంటి పిల్లలు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే... సీఎం కేసీఆర్ తీరు మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లే ఉందన్నారు. అంతేకాదు,తెలంగాణ సమయంలో కేసీఆర్ మొసలి కన్నీళ్లతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ఇక షర్మిల విమర్శలపై టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి పెద్దగా స్పందించట్లేదు.అనవసరంగా తాము షర్మిల గురించి మాట్లాడి ఆమెకు లేని మైలేజ్ ఇవ్వడమెందుకు అని భావిస్తున్నారో లేక ఇంకా పార్టీ కూడా పెట్టకముందే విమర్శలు ఎందుకు అని భావిస్తున్నారో గానీ మొత్తానికి షర్మిల రాజకీయంపై టీఆర్ఎస్ మౌనంగానే ఉంటోంది.

English summary
Among those who attended the Sankalpa Sabha organized by YS Sharmila on the 9th of this month in Khammam ... it seems that some of her followers were affected by the corona. Some of them are currently being treated at private hospitals in Hyderabad, while others are said to be in home isolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X