ఉద్యమంలో కేసీఆర్ మొసలి కన్నీళ్లు.. క్షమాపణ చెప్పాల్సిందే.. దీక్ష 72 గంటలు :వైఎస్ షర్మిల సంచలనం
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓవైపు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్లే వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఛాతిలో ఉన్నది గుండెనా... బండనా... అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై కొంచెం కూడా కనికరం లేదా అని నిలదీశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షలో వైఎస్ షర్మిల మాట్లాడారు.

నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు...: వైఎస్ షర్మిల
తెలంగాణలో 40 లక్షల మంది యువత నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. కొందరు యువకులు ఇక నోటిఫికేషన్లు రావన్న నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేయూలో సునీల్ కుమార్,నల్గొండకు చెందిన సంతోష్ కుమార్,సిరిసిల్లకు చెందిన మహేందర్... ఇలా ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ తీరు దున్నపోతు మీద వాన పడినట్లే ఉందన్నారు.

కేసీఆర్ మొసలి కన్నీళ్లు...
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మొసలి కన్నీరు కార్చారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇంతమంది యువకులు నోటిఫికేషన్లు లేక చనిపోతుంటే కేసీఆర్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో పరిస్థితి మారాలన్నారు. రాష్ట్రంలో 1లక్షా 90వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని... ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ప్రశ్నించినా,ప్రశ్నించకపోయినా నిరుద్యోగుల తరుపున తాను పోరాడతానని అన్నారు.నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యుడు కాదా అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇస్తే వారు బతికేవారు కదా అన్నారు.
Recommended Video

కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే...
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తన దీక్షను 72 గంటల పాటు కొనసాగిస్తానని సంచలన ప్రకటన చేశారు.నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు చేస్తూనే ఉంటామన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకుని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. తన మూడు రోజుల దీక్ష అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు.
కాగా,షర్మిల దీక్షకు పోలీసులు సాయంత్రం 5గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చారు. కానీ తాను 72గంటల పాటు దీక్ష కొనసాగిస్తానని షర్మిల అనూహ్య ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇందిరా పార్క్ వద్దనే ఆమె దీక్ష కొనసాగుతుందా.. లేక లోటస్ పాండ్ నుంచి కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications