
గాడిదకు రంగుపూసి ఆవు అని నమ్మించగల మోసగాడు కేసీఆర్.. నమ్మితే నరకమే: వైఎస్ షర్మిల
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను జోరుగా కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె ముందుకు వెళుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. కెసిఆర్ కుటుంబ పాలనను, అవినీతి పాలనను తెలియజేసి వచ్చే ఎన్నికలలో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలతో మాటా ముచ్చట నిర్వహిస్తూ ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దే
ఇక సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మరోమారు కెసిఆర్ పై విరుచుకుపడిన వైయస్ షర్మిల 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రంపై అనేక ఆశలతో ఉద్యమంలో పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలకు రాష్ట్ర సాధనతో ఒరిగింది ఏమీ లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

ఎస్టీ బంధు, బీసీ బంధు అంటాడు, మోసపోవద్దని హితవు
రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్.. ఎన్నికల సమయంలో మళ్లీ వస్తాడు . మనకు మాయమాటలు చెప్తాడు అని పేర్కొన్న వైయస్ షర్మిల, ఎస్టీ బంధు, బీసీ బంధు అంటాడు, మోసపోవద్దని హితవు పలికారు. గాడిదకు రంగుపూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మళ్లీ కేసీఆర్ ను నమ్మితే ఐదేండ్లు నరకమే అని హెచ్చరించారు. అంతేకాదు కెసిఆర్ ఒక మోసగాడు అని, రెండుసార్లు గెలిపిస్తే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని వైయస్ షర్మిల మండిపడ్డారు.
ముఖ్యమంత్రా ? మోసగాడా? కేసీఆర్ పై షర్మిల మండిపాటు
రాష్ట్రంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే, కేసీఆర్ కుటుంబం మాత్రం అందరూ పదవులను చేపట్టి బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఎవరికయ్యింది బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, అటువంటి వాడిని ముఖ్యమంత్రి అనాలా? మోసగాడు అనాలా అంటూ వైయస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు.

ఎనిమిది ఏళ్లలో 8 వేల మంది రైతుల బలవన్మరణాలు.. కేసీఆర్ చేసిందేంటి
టిఆర్ఎస్ పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని పేర్కొన్న వైయస్ షర్మిల, కెసిఆర్ ఇప్పటివరకు మహిళల కోసం ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. ఏ గ్రామంలో చూసినా పేదల కోసం వైయస్సార్ హయాంలో నిర్మించిన ఇళ్ళు తప్ప కెసిఆర్ కట్టినవి ఒక్కటి కూడా లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఎనిమిది ఏళ్లలో 8 వేల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్న షర్మిల, రైతు సంక్షేమాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారు అంటూ మండిపడ్డారు,

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పండి
ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చేఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని వైయస్ షర్మిల పిలుపునిచ్చారు.