ఎవడ్రా నీకు మరదలు; వీధికుక్కతో పోల్చి.. మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఘాటువ్యాఖ్యలు
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయా నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలు వ్యాఖ్యలు... నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
వనపర్తి నియోజకవర్గం లో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైయస్ షర్మిల నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను గుర్తు చేసి ఘాటుగా విమర్శించారు. గతంలో వైయస్ షర్మిలను ఉద్దేశించి ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైయస్ షర్మిల ఖండించారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.
అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్
మేం చేస్తున్న పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అంటూ మంత్రి నిరంజన్ రెడ్డిని నిలదీశారు. అసలు ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి పై రెచ్చిపోయిన వైయస్ షర్మిల సిగ్గు ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్ అంటూ వైయస్ షర్మిల హెచ్చరించారు. వీధి కుక్కకు నీకు తేడా లేదు అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి వైయస్ షర్మిల తీవ్రంగా తిట్టిపోశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేని దద్దమ్మ మంత్రి
యువత హమాలీ పని చేసుకోవాలని, రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా? అంటూ వైఎస్ షర్మిల మంత్రి నిరంజన్ రెడ్డిని తూర్పారబట్టారు. అంతేకాదు పేరుకు మాత్రమే నీళ్ల నిరంజన్ రెడ్డి కానీ ప్రజలకు మిగిల్చింది మాత్రం కన్నీళ్లే అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు.మంత్రి హోదాలో ఉండి, కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ అంటూ వైఎస్ షర్మిల నిరంజన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఏమీ లేని ఈ మంత్రి కెసిఆర్ లాగే వేల కోట్లు సంపాదించాడట. ఫాంహౌజ్ లు కట్టుకున్నాడట అంటూ తనదైన శైలిలో వైయస్ షర్మిల నిరంజన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసారి ఓట్లు అడిగితే కర్రు కాల్చి వాత పెట్టండి
అంతే కాదు తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగిన షర్మిల కేసీఆర్ నియంత పాలనలో సమస్యలు లేని గ్రామం లేదు అని మండిపడ్డారు. బాధలు లేని ఇల్లు లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి ఓట్లు అడగడానికి వస్తే కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి. అవి కమీషన్ల రూపంలో దోచుకున్న ప్రజల డబ్బే అని పేర్కొన్నారు. ఓటు మాత్రం మీకు సేవ చేసే వారికే వేయాలి అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications