వైఎస్సార్ రాజకీయాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ షర్మిల; అదునుచూసి పాలేరు నుండి తొలిఅడుగు!!
తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ వేసుకోవడానికి వైయస్సార్ తెలంగాణ పార్టీతో అడుగుపెట్టిన వైయస్ షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నా, రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ముందుకు సాగుతున్నారు. పార్టీ పెట్టిన అనతికాలంలోనే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసేలా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆసక్తిగా షర్మిల వైపు చూసేలా ఆమె రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. వైయస్సార్ బిడ్డగా వైయస్సార్ రాజకీయాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ షర్మిల వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేయకుండా రాజకీయంగా ముందుకు వెళుతున్న షర్మిల నేడు పాలేరు లో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.

పాలేరు నుండి తొలి అడుగు వేయనున్న షర్మిల
వచ్చేఎన్నికలలో పాలేరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన వైఎస్స్ షర్మిల పాలేరు కేంద్రంగా పార్టీ కార్యాలయానికి నేడు భూమి పూజ చేయనున్నారు. సరైన సమయంలో సరైన ప్రకటన చేశారు. ఉదయం 11 గంటలకు పాలేరు లో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్న షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుండి తొలిఅడుగు వేయనున్నారు. ఆమె పోటీ చేస్తానని ప్రకటించిన స్థానమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణం కాగా, పాలేరు షర్మిలకు బాగా కలిసొస్తుందని రాజకీయవర్గాలలో అప్పుడే టాక్ మొదలైంది.

వరంగల్ ఘటన .. ఆపై పరిణామాలతో ఒక్కసారిగా పెరిగిన షర్మిల ఇమేజ్
ఇంతకాలం ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన షర్మిల, వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దాడి, ఆపై తన అరెస్ట్, ఆమరణ నిరాహార దీక్ష వంటి ఘటనలతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇంతకాలం ఆమెను పట్టించుకోని వారు కూడా ఆమెపై దృష్టి పెడుతున్నారు. ఇక ఇదే అదునుగా వచ్చే ఎన్నికలకు దూకుడును పెంచిన వైయస్ షర్మిల సరైన సమయంలో అడుగు ముందుకు వేశారు. తాజాగా ఆమె పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చి, వచ్చే శాసనసభ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించినట్లు షర్మిల చెప్పకనే చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేసి వచ్చే ఎన్నికలకు పాలేరు నియోజకవర్గం నుండి తొలి అడుగుపెడుతున్నట్టు వైయస్ షర్మిల ప్రకటించారు.

నేడు వైఎస్సార్ తెలంగాణా పార్టీ పాలేరు కార్యాలయానికి భూమిపూజ
ఖమ్మం బైపాస్ రోడ్ లో ఉన్న కరుణగిరి చర్చి సమీపంలో భూమి కొనుగోలు చేసిన వైయస్ షర్మిల మొదటి సరిగా పాలేరు నియోజకవర్గం కోసం ఆఫీసు నిర్మాణం చేయడానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల నేడు ఉదయం 11 గంటలకు అక్కడ భూమి పూజ చేయనున్నారు. ఇక పాలేరులో వేస్తున్నతొలి అడుగు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విస్తరించే అవకాశం ఉందని, అన్ని నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల కోసం సన్నాహాలు చేయడానికి వైయస్ షర్మిల రంగంలోకి దిగిందని పార్టీ శ్రేణులలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వైఎస్సార్ లక్షణాలను పుణికి పుచ్చుకున్న షర్మిల.. అదును చూసి అడుగులు
ఒంటరిగా బరిలోకి దిగిన వైయస్ షర్మిల తనపై ఎవరు ఎంతగా విమర్శలు చేసినా, వారికి దీటుగా సమాధానమిస్తూ, అణచివేతను సైతం బలంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న తీరు పై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైయస్ షర్మిల పార్టీ విషయంలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లడంతో వైయస్సార్ రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకున్న నాయకురాలిగా వైయస్ షర్మిల కు రాజకీయ వర్గాలలో గుర్తింపు వస్తుంది. మొత్తంగా చూస్తే వైయస్ షర్మిల రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications