మళ్ళీ పాదయాత్రతో ప్రతి గడపకు రాజన్నబిడ్డ వైఎస్ షర్మిల; ప్రజాప్రస్థానం పాదయాత్ర మార్చ్11నుండే!!
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను ప్రజల ఇంటి ముంగిట నేరుగా తెలుసుకోవడం కోసం ఇప్పటికే మొదటి విడత ప్రజాప్రస్థాన పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభించిన వైయస్ షర్మిల ఇప్పుడు మళ్ళీ పాదయాత్రకు రెడీ అయ్యారు.
ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందన్న షర్మిల
మొదటి విడత ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 150 గ్రామాలలో పాదయాత్రను కొనసాగించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా విజృంభణ నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పాదయాత్ర కొనసాగించాలని ప్రయత్నం చేసినా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపధ్యంలో పాదయాత్రకు బ్రేక్ వేశారు షర్మిల. మళ్లీ ఇప్పుడు ప్రజా ప్రస్థానం పాదయాత్రను పునః ప్రారంభించాలని వైయస్ షర్మిల నిర్ణయించారు.

తెలంగాణాలో పార్టీ పెట్టిన నాటి నుండి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముద్దుల తనయగా, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైయస్ షర్మిల మళ్లీ ప్రజాక్షేత్రంలోకి ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి రానున్నట్టు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణలో పార్టీ స్థాపించిన నాటి నుండి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు వైయస్ షర్మిల. నిరుద్యోగ సమస్యపై దీక్షలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

మార్చి 11 నుండి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ నిత్యం అనేక ప్రజా సమస్యలపై వైఎస్ షర్మిల కేసీఆర్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తండ్రి బాటలో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రెండోసారి పాదయాత్రను మార్చి 11వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు వైయస్ షర్మిల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికలను టార్గెట్ చేసి ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ, తమ సత్తా చాటడం కోసం వైయస్ షర్మిల ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు, 14 పార్లమెంట్ స్థానాలలో నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంగా చేసుకొని 2021 ఆగస్టు 20వ తేదీన ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు వైయస్ షర్మిల. ప్రస్తుతం రెండో విడత జరగనున్న ఈ పాదయాత్రలో వైయస్ షర్మిల ఎన్ని నియోజకవర్గాలలో పర్యటించనున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర రూట్ మ్యాప్ పై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు సమాచారం.

పాదయాత్రతో ప్రతి గడపకు వస్తున్నా అని షర్మిల ట్వీట్
పాదయాత్ర పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన షర్మిల మీ సమస్యలను వినేందుకు, మీ కష్టాలను పంచుకునేందుకు, పాదయాత్రతో ప్రతి గడపకు వస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కెసిఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తూ, కెసిఆర్ నిరంకుశ వైఖరిని, పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని వైయస్ షర్మిల భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications