కేసీఆర్ కు వైఎస్ షర్మిల మార్క్ షాక్ .. అభివృద్ధికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలకి లింక్ పెట్టిన రాజన్న బిడ్డ
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ లు విరుచుకు పడుతుంటే, మరోపక్క కొత్తగా రాజకీయ పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో దూకుడు చూపిస్తున్న వైయస్సార్టీపి కూడా రోజుకో రకమైన మెలిక పెడుతూ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్షలతో కెసిఆర్ సర్కార్ పై పదునైన వాగ్దానాలను సంధిస్తున్న వైయస్ షర్మిల, తాజాగా రాష్ట్రంలో ఉప ఎన్నికల రాజకీయంపై తెలంగాణ ప్రజానీకం ఆలోచించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక షర్మిల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలంగాణా ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో నియోజకవర్గ అభివృద్ధి
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకోవడంతో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్రమంలో రానున్న ఉప ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తున్నారు. హుజరాబాద్ నియోజకవర్గంపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కెసిఆర్ మంత్రులను రంగంలోకి దించి అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు పెంచారు.తాజాగా దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా హుజురాబాద్ నుంచి ప్రారంభిస్తామని చెప్పడంతో ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశాయి.

ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు అభివృద్ధి గుర్తొస్తుందని విమర్శలు
కేవలం ఎన్నికలు ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అభివృద్ధి గుర్తొస్తుంది అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల సీఎం కేసీఆర్ ఎలక్షన్ ఉంటేనే దళిత బంధు పథకం పెట్టామని స్వయంగా ఒప్పుకున్నట్టు ఆ క్లిప్పింగ్ ద్వారా పేర్కొన్నారు. మీది ఫక్తు రాజకీయ పార్టీ అని ఒప్పుకున్నందుకు సంతోషం అంటూ పేర్కొన్న వైయస్ షర్మిల ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకం తీసుకొస్తాము తప్ప .. ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషం సారు అంటూ సెటైర్లు వేశారు.

మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ పని చెయ్యమన్న షర్మిల
ఇప్పటికైనా జనాలను మోసం చేస్తూ గెలుస్తామని ఒప్పుకున్నారన్నారు. ప్రజలారా ఆలోచించండి ..ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయి. ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అంటూ పేర్కొన్న షర్మిల మీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించండి అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే మీ ప్రాంతంపై కెసిఆర్ దృష్టి పడుతుంది అని పేర్కొన్న షర్మిల ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలు తెచ్చారు, గెలిచాక మూలన పడేస్తారు అంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో షర్మిల వ్యాఖ్యలపై ఆసక్తి
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో తాజా పరిణామాలు చూస్తున్న తెలంగాణ ప్రజలలో వ్యక్తమౌతుంది. ఈ క్రమంలోనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాలలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తే కచ్చితంగా ఆ నియోజకవర్గాలగ అభివృద్ధి కోసం కెసిఆర్ నిధులు కేటాయిస్తారని షర్మిల చేసిన వ్యాఖ్యలు సత్యదూరం కాదని తెలంగాణాలో చర్చ సాగుతుంది.
Recommended Video

సీఎం కేసీఆర్ కు రోజుకో మెలిక పెడుతున్న షర్మిల
రాష్ట్రంలో కొత్త పథకం ఏదైనా వచ్చినా, సడన్ గా సీఎం కేసీఆర్ ఏ ప్రాంతంపైన అయినా ఫోకస్ పెట్టి అభివృద్ధి చేసినా అది కచ్చితంగా ఎన్నికల స్టంట్ అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు కేసీఆర్ ఎన్నికల స్టంట్స్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మొత్తానికి సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో తాజా పరిణామాలపై, సమస్యలపై రోజుకో మెలిక పెడుతున్న వైయస్ షర్మిల కూడా తాజా మెలికతో అదును చూసి షాక్ ఇచ్చి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications