
YS Sharmila: పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పాదయాత్ర చేస్తా అంటున్న వైఎస్ షర్మిల.. సాధ్యమేనా?
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్ర అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆగిపోయిన పాదయాత్రను తిరిగి కొనసాగించాలని భావిస్తున్న షర్మిల ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా? షర్మిల పాదయాత్ర కొనసాగేలా పోలీసులు, బీఆర్ఎస్ నేతలు సహకరిస్తారా? ప్రజా క్షేత్రంలో వైయస్ షర్మిల మళ్లీ కెసిఆర్ సర్కార్ పై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గతంలో విరుచుకు పడినట్టే మళ్లీ విరుచుకుపడతారా? అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
OSCAR 2023: 'ఆర్ఆర్ఆర్' నాటు నాటు నామినేట్: చంద్రబాబు ట్వీట్; జూనియర్ ఎన్టీఆర్పై రచ్చ!!

జనవరి 28 నుండి పాదయాత్ర చేస్తా అంటున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 28వ తేదీ నుంచి ఎక్కడ నుంచి తన పాదయాత్రను ఆపానో అక్కడినుండే ప్రారంభిస్తానని తేల్చి చెప్పారు. తన పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3500 కిలోమీటర్లు మేర పాదయాత్రను తాను కొనసాగించానని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి జనవరి 28వ తేదీ నుంచి మళ్లీ తన పాదయాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

వైఎస్ షర్మిల పాదయాత్రపై కొనసాగిన రచ్చ
గతంలో వైయస్ షర్మిల పాదయాత్రలో వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దాడి ఘటన, ఆపై వైయస్ షర్మిల అరెస్ట్, ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వైయస్ షర్మిల పాదయాత్రతో శాంతి భద్రతల సమస్య వస్తుందని ఆమె పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో తన పాదయాత్ర కొనసాగించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో కొనసాగిన రచ్చ తెలిసిందే.

పాదయాత్ర అనుమతుల కోసం పోలీసులను ఆశ్రయించిన వైఎస్సార్టీపీ
ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడానికి వీలులేదని, ఒకవేళ వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే మహబూబాబాద్ లో నాడు జరిగిన రాళ్లదాడి ఘటన మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక అనేక కారణాలతో వైఎస్ షర్మిల పాదయాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం మళ్ళీ వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇక ఈనెల 28వ తేదీన వైయస్ షర్మిల మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్న పాదయాత్ర కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు అనుమతుల కోసం పోలీసులను ఆశ్రయించారు .

వరంగల్ లో పాదయాత్ర ముగింపు సభ ప్లాన్.. ఏం జరుగుతుందో?
నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి, వరంగల్లో ముగింపుగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. మరి పోలీసులు ఈసారైనా వైయస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇస్తారా? వైయస్ షర్మిల పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుందా? ఆగిన చోటు నుంచి పాదయాత్ర చేస్తానంటున్న షర్మిల పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు సహకరిస్తారా? వంటి అనేక ప్రశ్నలు రాజకీయ వర్గాల్లోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా పాదయాత్ర చేసి తీరుతానంటున్న వైఎస్ షర్మిల ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం అందరిలోనూ ఉత్కంఠ గా మారింది.