నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇదీ BJP-BRS యవ్వారం!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న వైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, రాష్ట్రంలోని అధికార గులాబీ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వచ్చే వరకూ, వైఎస్సార్ సంక్షేమ పాలన వచ్చేవరకు రాజకీయంగా వెనక్కి తిరిగి చూసేది లేదని తేల్చి చెప్పారు.

కేసీఆర్ ను బీజేపీ నేతలు ఏమీ చెయ్యలేరన్న వైఎస్ షర్మిల
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పైన, కెసిఆర్ కుటుంబ అవినీతి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల, ఒక్క కేసీఆర్ ను మాత్రమే కాకుండా తాజాగా బిజెపి ని కూడా తిట్టిపోశారు. రెండు పార్టీలు ఒక్కటేనంటూ వైయస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీల తీరును సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెట్టారు. బిజెపి నేతల మాటలు ఢిల్లీ కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గోల్కొండ కోట కే పరిమితం అయ్యాయని, సీఎం కేసీఆర్ విషయంలో వాళ్ళు చేసేదేమీ లేదని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అవినీతిపై బీజేపీ నేతల మాటలు గోల్కొండ కోటకే పరిమితం
'కేసీఆర్ అవినీతి శక్తి' అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, కెసిఆర్ అవినీతిపరుడని అమిత్ షా అన్నారని, తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కి ఏటీఎంల మారిందని బియ్యం సంతోషం వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇక కేసీఆర్ అవినీతి ని బయటపెట్టిన అని కిషన్ రెడ్డి, కెసిఆర్ ను జైలుకు పంపుతామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. బిజెపి నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గోల్కొండ కోట కే పరిమితం అయ్యాయని వైయస్ షర్మిల విమర్శించారు.

కళ్ళ ముందు కేసీఆర్ అవినీతి కనిపిస్తున్నా బీజేపీ ఏమీ చెయ్యదు
ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతల మాటలు పాడిందే పాడరా పాచిపళ్ళ బిజెపి అన్నట్లుగా ఉందని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. చెప్పడం తప్ప, కెసిఆర్ విషయంలో చేసింది ఏమీ లేదని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతి కళ్ళముందు కనిపిస్తున్నా, మాటలు చెప్పే బిజెపి చర్యలు మాత్రం తీసుకోదని వైయస్ షర్మిల విమర్శించారు. నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టు బిజెపి బీఆర్ఎస్ నేతల వ్యవహారం ఉందని వైయస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు.

కెసిఆర్ అవినీతిపై ఎందుకు సిబిఐ దర్యాప్తు కోరడం లేదు
అంతేకాదు కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి కనిపిస్తున్నా చర్యలు శూన్యమన్నారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా ఇప్పటి వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము బిజెపికి లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పై సీబీఐ విచారణ అడిగిన బీజేపీ నాయకులు, కెసిఆర్ అవినీతిపై ఎందుకు సిబిఐ దర్యాప్తు కోరడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి వాటాలో మీ లీడర్ల హస్తం ఉందనా? అంటూ వైఎస్ షర్మిల బిజెపి నేతల పైన కూడా సంచలన ఆరోపణలు చేశారు. లేదంటే ఇన్నిసార్లు కేసీఆర్ అవినీతి పై ఆరోపణలు చేస్తున్న బిజెపి నాయకులు ఎందుకు కెసిఆర్ అవినీతిపై సీబీఐ విచారణ కోరడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications