YS Sharmila: పార్టీ ముఖ్య నేతలకు రాఖీ కట్టిన వైఎస్సార్టీపీ అధినేత్రి
హైదరాబాద్: అన్నా చెల్లళ్ల అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా భావించే రక్షాబంధన్ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోన్నారు. తమ తోడబుట్టిన వారికి రాఖీలను కట్టి.. ఆశీర్వాదాలను అందుకుంటోన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. కోట్లాదిమంది మహిళలు.. తమ అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు ఈ రాఖీ పండుగ కొంత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఎప్పట్లాగే ఆమె తన అన్న వైఎస్ జగన్‌కు రక్షాబంధన్ కట్టలేకపోయారు. ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి నాడు వైఎస్ షర్మిల ఎక్కడ ఉన్నా గానీ.. వైఎస్ జగన్ కలుసుకొని, రాఖీ కడతారు. చాలా సంవత్సరాలుగా ఆమె ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తోన్నారు. ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీకి బ్రేక్ పడింది.

దీనికి కారణం-రాజకీయాలే. తెలంగాణలో కొత్తగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నెలకొల్పడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నతోనైనా యుద్ధానికి సిద్ధమంటూ ఆమె ఇదివరకు ప్రకటనలు చేశారు. జల వివాదాల విషయంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాల తరువాతే తనకెవరైనా అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలు చేయడానికి ముందు నుంచే వైఎస్ జగన్-వైఎస్ షర్మిల మధ్య కొంత దూరం ఏర్పడిందనే వార్తలొచ్చాయి.

దానికి అనుగుణంగా వైఎస్ షర్మిల.. ఏపీకి వెళ్లలేకపోయారు. తోబుట్టువుకు తన చేతులతో రాఖీ కట్టలేకపోయారు. అయినప్పటికీ- ట్వీట్ ద్వారా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన తోడబుట్టిన జగనన్నకు రాఖీ గ్రీటింగ్స్ చెప్పారు.

అనంతరం ఈ మధ్యాహ్నం తన లోటస్ పాండ్ నివాసంలో పార్టీ ముఖ్య నాయకులకు వైఎస్ షర్మిల రాఖీ కట్టారు. పార్టీ సీనియర్ నేతలు కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులకు స్వయంగా రక్షాబంధన్ కట్టి బెస్ట్ విషెస్ చెప్పారు.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం అండగా నిలిచిన, తాను ఎంచుకున్న మార్గంలో కలిసి నడుస్తున్న వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపుతున్నానని పేర్కొన్నారు. ఆశయ సాధనలో తనను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications