తిరుమలలో కన్నుల పండువగా- తొలి రోజు ఇలా..!!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి వారిగా తిరుమలేశుడు భక్తులకు దర్శనం ఇచ్చారు.
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. గురువారం 60,682 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,291 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.32 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

సాలకట్ల తెప్పోత్సవం..
తిరుమలలో ఇవ్వాళ శ్రీవారికి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండువగా ఆరంభం అయ్యాయి. అయిదు రోజుల పాటు అంటే ఈ నెల 7వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ అయిదు రోజులూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పలలో శ్రీవారు, పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.

తొలిరోజున..
తొలి రోజున శ్రీరామచంద్రమూర్తిగా తిరుమలేశుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగుతూ శ్రీవారు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణి చుట్టూ మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

రెండో రోజు..
మార్చి 4వ తేదీన రెండవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తారు శ్రీవారు. పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తారు. మార్చి 5వ తేదీన మూడో రోజు శ్రీ భూదేవిసమేతంగా మలయప్ప స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీమలయప్ప స్వామివారు మార్చి 6వ తేదీన నాలుగో రోజు నాడు అయిదుసార్లు, చివరి రోజైన మార్చి 7వ తేదీన ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 7వ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాలకట్ల తెప్పోత్సవాలను కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications