భార్యపై అనుమానం: 8నెలల కొడుకుకు నిప్పంటించిన శాడిస్ట్ తండ్రి; ఏపీలో దారుణం
సమాజంలో మానవ సంబంధాలు, అనుబంధాలు రోజురోజుకు మృగ్యం అయిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే పిల్లలపై తల్లిదండ్రులు శాడిస్టుల మాదిరిగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇక పిల్లలు కూడా కని పెంచిన తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్న ఘటనలు, హతమారుస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇక ధోరణి మానవులలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతుంది.

భార్యపై కోపంతో 8 నెలల కుమారుడిపై దారుణం
కడుపున పుట్టిన బిడ్డలపై కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా బీహార్ లో ఓ తల్లి తన మూడేళ్ల కూతురిని బ్రతికుండగానే పాతిపెట్టి అమ్మతనానికి మాయని మచ్చను తెస్తే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తండ్రి భార్య పై కోపంతో ఎనిమిది నెలల పసి బాబును కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన నాన్న అన్న మాటకు అర్థం లేకుండా చేసింది. తండ్రి చేసిన పని అభం శుభం తెలియని పసి వాడిని ఆస్పత్రిపాలు చేసింది.

భార్యపై అనుమానం.. కొడుకును చంపేందుకు ఫినాయి, తాగించిన తండ్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో జరిగిన దారుణ ఘటన వివరాల్లోకి వెళితే వడమాలపేట మండలం బట్టికండ్రిగ హరిజనవాడకు చెందిన రమేష్‌కు భార్యపై అనుమానం వచ్చింది. సోమవారం ఉదయం నుంచి భార్య కనిపించకపోవడంతో.. తనపై భార్య పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. తన చిన్న కొడుకు 8 నెలల మహేశ్‌కు ఫినాయిల్ తాగించి హత్య చేసేందుకు ప్రయత్నించి కొడుకుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇక ఈ విషయం తెలిసిన అమ్మమ్మ వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది.

మళ్ళీ కొడుకుపై కసితీరని తండ్రి దారుణం... కిరోసిన్ పోసి తగలబెట్టిన తండ్రి
ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో ఆమె బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి అయినా భార్య రాకపోవడంతో తండ్రి రమేష్ మరోసారి కొడుకు మహేష్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అతను పెద్దగా ఏడవడం తో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. మహేశ్ ను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు బాగా కాలడంతో బాబుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా భార్యతో గొడవలకు దిగుతున్న రమేష్, భార్యపై తనకు ఉన్న కోపాన్ని పసికందు పై తీర్చుకుని అమానుషంగా ప్రవర్తించాడు. భార్యా భర్తల మధ్య ఏవైనా గొడవలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఈ తరహా అమానవీయ ఘటనలకు పాల్పడటం మంచిది కాదని అంటున్నారు. చిన్న పిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా ప్రవర్తించిన తండ్రిని తగిన విధంగా శిక్షించాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications