ఈ నెలలో తిరుమలలో విశేష కార్యక్రమాలు ఇవే- బ్రహ్మోత్సవాలు ఒక్కటే కాదు..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. 31 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. శనివారం 81,655 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,882 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

ఇక సెప్టెంబర్‌లో స్వామివారి విశేష ఉత్సవాలను నిర్వహించబోతోన్నారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు. ఈ నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు.
7వ తేదీన గోకులాష్టమితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 30వ తేదీన మహాలయంతో ముగుస్తాయి. 7వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 13వ తేదీన మాస శివరాత్రి ఉత్సవాలను జరుపుతారు. 17వ తేదీన బలరామ జయంతి, శ్రీ వరహా జయంతి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తారు.
అదేరోజున సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 18వ తేదీన వినాయక చవితి పండగ, 19వ తేదీన రుషి పంచమి ఉత్సవాలు ఉంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22వ తేదీన గరుడ సేవను జరుపుతారు. 26వ తేదీన వామన జయంతి, 28న అనంత పద్మనాభ వ్రతం ఉంటుంది.
అదే రోజున సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ముగింపు సందర్భంగా చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 29వ తేదీన పౌర్ణమి వేడుకలను ఘనంగా చేపడతారు. 30వ తేదీన మహాలయ పక్షాలు మొదలవుతాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్నందున టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications