తిరుమలలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. ఈ తేదీల్లో
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం ఆరంభమైన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. శుక్రవారం 69,529 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,227 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

నేటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాల ఆరంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ- శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసింది.
పవిత్రోత్సవాల అంకురార్పణలో భాగంగా ముందుగా సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరంలో అప్పటి టీటీడీ పాలకమండలి ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.












Click it and Unblock the Notifications