రేపు తీరం దాటనున్న వాయుగుండం: నెల్లూరు, చిత్తూరుకు వరదగండం: తమిళనాడుకు రెడ్ అలర్ట్
తిరుపతి: కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారిపోయాయి. వరదనీటితో పోటెత్తాయి. భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి.. తొణికిసలాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. వర్షాలు ఇక్కడితో ఆగిపోవచ్చంటూ ఊపిరి పీల్చుకునేలోపే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమైంది.
కుండపోత మొదలు..
అండమాన్ తీర ప్రాంతానికి సమీపంలో మధ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారింది. వాయుగుండంగా మారింది. ఆగ్నేయ దిశగా కదులుతూ..ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర తీర ప్రాంత జిల్లాలను సమీపించింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నై సహా పలు తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు.
చెన్నై-నెల్లూరు మధ్య..
ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతుందంటూ వాతావరణ కేంద్రం అధికారులు వేసిన అంచనాలు తప్పలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఈ ఉదయం 8:30 గంటల సమయంలో అల్పపీడనంగా మారింది. మరింత బలపడింది. ఉదయం 11:30 గంటల సమయానికి చెన్నైకి ఆగ్నేయంగా బంగాళాఖాతంలో 220, పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్య దిక్కున 210 కిలోమీటర్ల దూరానికి చేరుకుందని తెలిపారు.
తమిళనాడు-పుదుచ్చేరి మధ్య..
శుక్రవారం ఉదయం నాటికి ఈ అల్పపీడనం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. కరైకల్, కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రాయలసీమ, ఏపీ దక్షిణ కోస్తాపై ప్రభావం..
ఈ ఉదయం నుంచి తమిళనాడు, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు, కర్ణాటక, కరైకల్‌లల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈదురుగాలులు గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. వచ్చే 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అనంతరం దీని తీవ్రత తగ్గుముఖం పడుతుందని వివరించారు. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
తిరుపతి, తిరుమలల్లో..
తీరానికి సమీపిస్తోన్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో ఈ తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. తిరుమల కొండపైనా ఇదే పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవ్వాళ కూడా అలిపిరి మెట్ల మార్గాన్ని మూసివేశారు. తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండటంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.
నెల్లూరులో..
నెల్లూరులోనూ ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడతో పాటు తమిళనాడు ఉత్తర కోస్తా తీర ప్రాంతంలోనూ ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. కాగా- చెన్నై సహా తమిళనాడులోని పలు తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు.
Bro in Nellore now started pic.twitter.com/4ojjfgudw3
— Saisarvan6041 (@Saisarvan60413) November 18, 2021
Right now Tirupati @APWeatherman96 https://t.co/lw5kHEdIu1 pic.twitter.com/VvqQ9Un7lW
— అశోక్ కుమార్ రెడ్డి కంభం (@Kambham_Ashok) November 18, 2021
@APWeatherman96 మాములుగా పడటం లేదు వాన తిరుపతి లో pic.twitter.com/GWsh5UIxUN
— Karthik Nayak (@KarthikYaksha1) November 18, 2021












Click it and Unblock the Notifications