చంద్రబాబుకా వయసై పోయింది - అవే చివరి ఎన్నికలు..!!
తిరుపతి: రాష్ట్రంలో పోటాపోటీగా ఉద్యమాలు మొదలయ్యాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర ఒకవంక కొనసాగుతుండగా- మరోవంక మూడు రాజధానులకు అనుకూలంగా మూడు ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కారు. బైక్ ర్యాలీలను నిర్వహిస్తోన్నారు. నియోజకవర్గ స్థాయిలో సభలు, సమావేశాలను జరుపుకొంటోన్నారు. ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన పేరిట ఈ నెల భారీ ర్యాలీ చేపట్టాలని ఐక్యకార్యాచరణ సమితి నిర్ణయించింది.

జిల్లాలవారీగా..
రైతులు చేపట్టిన పాదయాత్ర గమ్యస్థానానికి చేరువ అవుతున్న కొద్దీ మూడు రాజధానులకు డిమాండ్ ఊపందుకుంటోంది. దీనికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు జోరుగా ఏర్పాటవుతున్నాయి. జిల్లాలవారీగా రోజూ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం బైక్ ర్యాలీలను హోరెత్తిస్తోన్నారు. ఉత్తరాంధ్ర వరకు మాత్రమే ఈ ఉద్యమాలు పరిమితం కాలేదు. అటు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ దీని తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది.

చంద్రబాబుపై కే నారాయణ స్వామి ఫైర్..
ఈ పరిణామాల మధ్య ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఆయన గళం విప్పారు. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రనూ తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి దీన్ని నడిపిస్తోన్నారని విమర్శించారు. 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటోన్నారని నారాయణ స్వామి ధ్వజమెత్తారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి..
తిరుపతిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని నారాయణ స్వామి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల విధానాన్ని తెర మీదికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా ప్రజలకు అందజేస్తోన్నారని గుర్తు చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూస్తోన్నారని ఆయన చెప్పారు.

బినామీల కోసం..
పేద ప్రజలు బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని, తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నారాయణ స్వామి ఆరోపించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగించేలా, తన బినామీల బాగు కోసం చంద్రబాబు అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్నాడని విమర్శించారు. కార్పొరేట్ సిస్టమ్, రియల్ ఎస్టేట్‌కు చంద్రబాబు కొమ్ముకాస్తున్నాడని మండిపడ్డారు. తన బినామీలను కాపాడుకోవడానికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోన్నారని అన్నారు.

హైదరాబాద్ తరహా పరిస్థితి..
తెలంగాణ నుంచి వేరు పడిన సమయంలో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని నారాయణ స్వామి పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అలాంటి వ్యవస్థ కోసమే పోరాడుతున్నారని, రాష్ట్రం ఏమైపోయిన ఫర్వాలేదనిపించేలా- అమరావతి ప్రాంతం ఒక్కటే బాగుపడితే చాలనిపించేలా చంద్రబాబు వైఖరి ఉందని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలను అమరావతిలోనే కేంద్రీకృతం చేయడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తలెత్తే ప్రమాదం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు అవే చివరి ఎన్నికలు..
అమరావతి కోసం గతంలో చంద్రబాబు శవయాత్ర చేపట్టాడని, ఇప్పుడు కోటీశ్వరుల యాత్రను ఆయన నడిపిస్తోన్నాడని నారాయణ స్వామి విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా ఆయా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు అమరావతి ప్రాంత రైతులకు శిక్షణ ఇచ్చినట్టుగా ఉందని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, 2024 ఎన్నికలే చివరివని నారాయణ స్వామి తేల్చి చెప్పారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఇప్పటికైనా తన ఆలోచన ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications