ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి బాలినేని
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఏకగ్రీవ విజయాలను సాధిస్తుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. 2024 ఎన్నికలకు ఇక్కడే పునాది పడుతుందని పేర్కొన్నారు.
తిరుపతి: రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంటోంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకావడం ఖాయమైంది. ఈ నెల 24వ తేదీ తరువాత నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఇక మిగిలిన స్థానాల్లోనూ ఏకగ్రీవ విజయాలను సాధించాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోన్నారు.

ఇందులో భాగంగా- ఇవ్వాళ తిరుపతిలో వైసీపీ మంత్రులు భేటీ అయ్యారు. బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు ఆర్ కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే నారాయణ స్వామి, వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలినేని మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పశ్చిమం, రాయలసీమ తూర్పు ప్రాంత నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని, ఆయన సారథ్యంలో ఘన విజయం సాధిస్తామని అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాబోతోందని వ్యాఖ్యానించారు. ఇవే తరహా ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమౌతాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ- రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి బడుగు, బలహీనవర్గాల ప్రజలు సంతోషంగా ఉంటోన్నారని, అధికార పార్టీపై ఎలాంటి వ్యతిరేకత లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 95 శాతం హామీలను అమలు చేశామని బాలినేని శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ ను ఎదుర్కొనే ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications