ఉద్యోగం పోయింది..: తిరుపతి హోటల్‌లో హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్/తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి హోటల్‌లో రూం తీసుకున్న అతడు.. గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీధర్(38) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, కొడుకు ఉన్నారు. ఐదు నెలల క్రితం అతడ్ని కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఫలితం లేకపోయింది.

Recommended Video
ఈ క్రమంలోనే అతడు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లొస్తానని భార్యకు చెప్పాడు. ఆన్‌లైన్‌లోనే తిరుపతిలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ హోటల్ వివరాలు కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో అతడు తిరుపతికి వెళ్లాడని కుటుంబసబ్యులు భావించారు.
అయితే, సోమవారం మధ్యాహ్నం నుంచి అతడి మొబైల్‌కు ఫోన్ చేసినా తీయడం లేదు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు సదరు హోటల్‌కు ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది శ్రీధర్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లారు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో డోర్లు పగలగొట్టారు. బెడ్ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు శ్రీధర్.
వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబసబ్యులకు అప్పగించారు. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతోనే ఉరివేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications