చంద్రప్రభ వాహనంపై తిరుమలేశుడు..
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
బుధవారం 74,884 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,213 మంది తలనీలాలను సమర్పించారు. గరుడ సేవ తరువాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి రథోత్సవానికి ముందురోజు సాయంత్రం బంగారు గొడుగు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య పూర్తి చేశారు. శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది నూతన ఛత్రస్థాపనాన్ని నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. నవనీత కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చంద్రప్రభ వాహనారూఢుడైన శ్రీవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తులు మలయప్ప స్వామిని దర్శించుకున్నారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. శ్రీవేంకటేశ్వరస్వామి, కృష్ణుడు, గోపికల వేషధారణలో కనిపించారు. వేదమంత్రోచ్ఛారణలతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి.












Click it and Unblock the Notifications