తిరుమలలో ఈ నెల 17, 18 తేదీల్లో..
Ram Navami 2024: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. శనివారం నాడు 82,139 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 39,849 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
భక్తుల రద్దీతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. కృష్ణతేజ అతిథిగృహం వరకూ భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి. ఈ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. రోజువారీ కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీరాములవారు హనుమంత వాహనంపై నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.
ఈ కారణంగా శ్రీరామ నవమి రోజున సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆ మరుసటి రోజున అంటే- ఏప్రిల్ 18వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications