టీటీడీకి రూ 3 కోట్ల జరిమానా : కేంద్రంతో చర్చలు, అయినా - చెల్లింపు...!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీటీ)కి కేంద్రం భారీ జరిమానా విధించింది. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదంగా మారుతోంది. రూ 4.33 కోట్లుగా విధించిన జరిమానా పైన టీటీడీ ఈవో కేంద్ర హోం శాఖ అధికారులతో చర్చలు చేసారు. టీటీడీ ధార్మిక సంస్థ అని..వ్యాపార సంస్థగా చూడవద్దంటూ సూచించారు. అనేక సార్లు చర్చల తరువాత ఆ మొత్తాన్ని కుదించి రూ 3 కోట్లు జరిమానాగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని టీటీడీ చెల్లించింది. ఇప్పుడు ఈ వ్యవహారం లో కేంద్ర తీరు పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలకు జరిమానా విధంచటం పైన ప్రశ్నలు మొదలయ్యాయి.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదు. తరచూ భారీ మొత్తాల్లో అజ్ఞాత భక్తులు నగదు వేస్తుంటారు. అదే సమయంలో విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు సైతం తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుంది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించలేదు.

విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద లైసెన్సు పొందింది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్‌పై టీటీడీ దృష్టి సారించలేదు. కేంద్ర హోం శాఖలోని ఎఫ్‌సీఆర్‌ఏ విభాగం 2019లో దీన్ని గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం.. విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించుకోకూడదు. కానీ టీటీడీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్‌లో ఇవ్వలేదని తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.
The most sacred Tirumala Tirupati Devasthanams (TTD) visited by lakhs of Indian pilgrims daily gets a notice and a ₹3 crore fine from the Modi Govt while Adani gets away scot-free.
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 27, 2023
Modani Hai Toh Mumkin Hai! pic.twitter.com/s6BbTWzOmJ
టీటీడీకి జరిమానాపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తాజాగా ట్వీట్ చేశారు. టీటీడీకి జరిమానా విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీంతో ఇది రాజకీయ వివాదంగా మారుతోంది. కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్‌ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించామని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. విదేశీ కరెన్సీని విరాళాలుగా స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును 2018కి ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేశారన్నారు. ఈ ఐదేళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. ఈ నగదు ఎవరిచ్చారు.. ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని తెలిపారు. భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదన్నారు. ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులతో రెండుమూడు సార్లు చర్చించి టీటీడీ వ్యాపార కేంద్రం కాదని, ఓ ధార్మిక క్షేత్రమని వివరించారన్నారు. దీంతో జరిమానాను రూ.3 కోట్లుగా నిర్ణయించారన్నారు. ఈ మొత్తాన్ని టీటీడీ చెల్లించిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications