తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త: 27న సర్వ దర్శన టికెట్లు విడుదల
తిరుపతి: తిరుమల శ్రీవారికి శుభవార్త. 2022 జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం(ఎస్ఎస్‌డి) టోకెన్లను డిసెంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

కాగా, జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా, కేవలం గంట వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటలకు విడుదల చేయగా... కేవలం 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు.
ఇక, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగిటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది టీటీడీ. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు స్పస్టం చేసింది.
ఈ నిబంధనను టీటీడీ ఇదివరకే తెలియజేసినప్పటికీ.. కొంతమంది భక్తులు ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా వచ్చేస్తున్నారని, అలాంటి వారిని అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర అధికారులు ఆపివేస్తారని టీటీడీ తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ లేనివారిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కి పంపుతారని.. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నియమం అమలు చేయడం జరుగుతోందని.. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది. కాగా, ఏపీలో కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా స్వల్పంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications