తిరుమలలో కొనసాగుతున్న రద్దీ - టీటీడీ మరో ముఖ్య నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తులు రెండు కిలో మీటర్ల మేర బారులు తీరి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీ వేళ టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. కాలినడక మార్గాల్లో భక్తుల సందడి అధికంగా ఉంది. ఇదే సమయంలో టీటీడీ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కు ముహూర్తంగా నిర్ణయించారు.
పెరిగిన భక్తుల రద్దీ:
తిరుమలలో వేసవి సెలవులతో పాటుగా వారాంతపు రద్ద పెరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన (టోకెన్ రహిత) భక్తులతో నిండిపోయిన క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీఐపీ బ్రేక్ ముగిసిన తర్వాత సర్వదర్శన భక్తులకు వేగంగా దర్శనం కల్పించడంతో సాయంత్రానికి లైన్ నారాయణగిరి ఉద్యానవన షెడ్లకు చేరింది. వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో గదులకు డిమాండ్ కొనసాగుతునే ఉంది.

దర్శనానికి 20 గంటల సమయం:
శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, రోడ్లు, అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్, కల్యాణకట్ట వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. క్యూ లైన్లు పెరిగిపోవటంతో టీటీడీ భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు అందిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలపైన పరిమితి విధించింది.
కరీంనగర్ లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం:
తెలంగాణలోని కరీంనగర్ లో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనుంది. మే 31వ తేదీ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ మంత్రి కమలాకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు వినోద్ కుమార్ టీటీడీ ఈవో ధర్మారెడ్డితో సమావేశమయ్యారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వారు వివరించారు. కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ చక్కగా ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. 31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి చెప్పారు. టీటీడీ అర్చకులు, సిబ్బందికి అవసరమైన వసతి సమకూరుస్తామన్నారు.












Click it and Unblock the Notifications