టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్: ఉలిక్కి పడ్డ సిబ్బంది
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమలకు బెదిరింపు ఫోన్ కాల్ అందింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయానికి ఫోన్ చేశారు. బాంబు పెట్టినట్లు సమాచారం ఇచ్చారు. అలిపిరిలో గల టోల్‌గేట్‌ను పేల్చివేస్తామంటూ హెచ్చరించారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ భద్రత విభాగం అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. తిరుపతి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

భద్రత సిబ్బంది తనిఖీల్లో ఎక్కడే గానీ బాంబు పెట్టిన ఆనవాళ్లు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ఉదయం 11:25 నిమిషాలకు టీటీడీ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిసింది.
ఈ ఫోన్ కాల్ అందిన వెంటనే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. ఫోన్ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్, భధ్రత విభాగం అధికారులు. ఈ ఫోన్ కాల్ నకిలీదిగా నిర్ధారించారు పోలీసులు.
తమిళనాడులోని సేలంకు చెందిన బాలాజీ అనే వ్యక్తి ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. అతణ్ని అరెస్ట్ చేశారు. టీటీడీకి ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి దుష్ప్రచారాన్ని సహించబోమని, భక్తులను భయాందోళనలకు గురి చేసే, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications