తిరుమలలో మరో రెండు చిరుతలు, ఎలుగుబంటి సంచారం
తిరుపతి: తిరుమలలో ఇప్పటికే రెండు మూడు చిరుతలను బంధించినప్పటికీ.. తాజాగా, క్రూర మృగాల సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి-తిరుమల నడక మార్గంలో మరోసారి రెండు చిరుతలు, ఓ ఎలుగుబంటి కనిపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది.
నడక మార్గంలో ఏడో మైలు వద్ద పెట్టిన కెమెరాల్లో శుక్రవారం, శనివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు కనిపించాయి. ఆదివారం సాయంత్రం నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ ఓ ఎలుగుబంటి సంచారం గుర్తించారు. ఎప్పటికప్పుడు జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నామని, ఆ మేరకు నడకదారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అటవీశాఖ డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు.

నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా నవంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.












Click it and Unblock the Notifications