Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - నేడే టికెట్ల కోటా విడుదల..!!
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తోంది. ఈ రోజు ( బుధవారం) సాయంత్రం అన్ లైన్ ద్వారా స్వామి వారి సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాధారణంగా వేసవిలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీ వేళ శ్రీవారి దర్శనాలతో పాటుగా సేవలకు సంబంధించి భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. వీరి కోసం టీటీడీ ముందుగానే సేవా టికెట్లను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారికి అందించే ప్రధాన సేవల్లో భాగ్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. ఇందు కోసం ఆన్ లైన్ విధానం ద్వారా సేవా టికెట్లను విడుదల చేస్తోంది.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో శ్రీవారి సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వీటిలో కల్యాణోత్సవం..ఊంజల్ సేవ..ఆర్జిత బ్రహ్యోత్సవం..సహస్రదీపాలంకర సేవలు ఉన్నాయి. అదే విధంగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెందిన ఇతర ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. ఆన్ లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 24 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

ఈ సేవా టికెట్ల కోటాను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు. టీటీడీఅధికారిక వెబ్ సైట్ తో పాటుగా తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ దేవస్థానమ్స్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఈ సేవా టికెట్లను పొందవచ్చని టీటీడీ వెల్లడించారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఈ క్లౌడ్ టెక్నాలజీని టీటీడీ వినియోగిస్తోంది. టీటీడీ తీసుకొచ్చిన ఈ యాప్ కు భక్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. అప్పటికే లక్షలాది మంది భక్తులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక..వచ్చే మూడు నెలల కాలానికి సంబంధించిన సేవా టికెట్లు విడుదల చేయనుండటంతో అనూహ్య డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications