Tirumala: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం - మే నెల వసతి గదుల కోటా విడుదల..!!
తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ఇప్పటికే జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ, ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ రోజు (ఏప్రిల్ 21)న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
నేడు ఉచిత ప్రత్యక దర్శనం కోటా:వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ రోజు (ఏప్రిల్ 21)న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇదే సమయంలో వేసవిలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. దర్శనం..వసతి కేటాయింపులో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.

ప్రత్యేక దర్శనం..వసతి కోటా:ఇక, మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. దీంతో పాటుగా తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ లో ఈ ఆన్ లైన్ కోటా ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్లు..వసతి కోటాను బుక్ చేసుకోవచ్చని టీటీడీ స్పష్టం చేసింది. గురువారం కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాతో పాటుగా శ్రీవాణి ఆన్ లైన్ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
భక్తుల లగేజీని మరింత సులభంగా:తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచి వెళ్లే భక్తుల లగేజీని మరింత సులభంగా తిరుమలలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు నడక మార్గాల్లో భక్తులు భద్రపరిచిన లగేజి సామర్థ్యాన్ని పెంచేందుకు యాంత్రికరణను చేస్తూ త్వరితగతిన మరింత సులభంగా అందించాలన్నారు. తిరుమలలో భక్తులు లగేజి తీసుకోవడానికి అవసరమైన డెలివరీ కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. లగేజి డెలివరీ కేంద్రాల సంఖ్య మరింత పెంచిన తర్వాత అక్కడ అవసరమైన లగేజీ బ్యాగుల నెంబరు, బార్ కోడ్ నెంబరు తదితర అంశాలు కనిపించేలా ఎలక్ట్రానిక్ సమాచార ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌంటర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించారు.












Click it and Unblock the Notifications