ఆంజనేయుడు మనవాడే: ఆధారాలతో సహా వెల్లడించిన టీటీడీ: నాలుగు నెలల సుదీర్ఘ అన్వేషణ
తిరుపతి: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం ఆంజనేయుడి జన్మస్థలంపై ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోన్న వివాదాలకు తెర దించింది తిరుమల తిరుపతి దేవస్థానం. హనుమంతుడు.. అంజనాద్రి పర్వతంపైనే జన్మించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించింది. ఇన్నాళ్లూ కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన, పర్యాటక కేంద్రం హంపి సమీపంలోని కిష్కింధ వద్ద గల ఆంజనేయ బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తూ వచ్చారు. దాన్ని ఎవరూ శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు. తాజాగా- అంజనాద్రి పర్వతమే వాయుసుతుడి జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది.
Recommended Video
ఆంజనేయ స్వామివారి జన్మస్థలంపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తామని టీటీడీ అధికారులు ఇటీవలే ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని తెలిపారు. అంజనాద్రి.. సాక్షాత్ శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని భావించే తిరుమలగిరుల్లోని ఓ పర్వతం. ఆంజనేయుడి తల్లి అంజన పేరు మీదే వెలసింది.

తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఆనంద నిలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ సమీపంలో ఉంటుందీ అంజనాద్రి పర్వతం. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి. వేంకటాద్రి, నారాయణాద్రిగా పిలుస్తారు. అందులో ఒకటైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీధర శర్మ ప్రకటించారు.
హనుమంతుడి జన్మస్థానం ఏదనే విషయంపై అన్వేషణ సాగించడానికి టీటీడీ ఇదివరకే ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి మురళీధర శర్మ నేతృత్వం వహించారు. ఇందులో శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ, సదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా వ్యవహరించారు.

హనుమంతుడి జన్మస్థలంపై ఈ కమిటీ పరిశోధనలు సాగించింది. నాలుగు నెలల పాటు వారి అన్వేషణ సాగింది. శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేయడానికి అవసరమైన ఆధారాలను సేకరించింది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వాటిని వెల్లడించిందా కమిటీ. హనుమంతుడు అంజనాద్రి పర్వతంపైనే జన్మించాడనటానికి సమగ్ర అన్వేషణ సాగించామని, ప్రాచీణ గ్రంధాలను అధ్యయనం చేశామని అన్నారు. శాస్త్రీయ బద్ధమైన ఆధారాలను సేకరించామని మురళీధర శర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications