TTD: తిరుమల నడకదారి మార్గంలో తాజా ఆంక్షలు - భక్తులు ఇక నుంచి..!!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలసి భూమన పరిశీలించారు. ఇదే సమయంలో అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడక మార్గంలో కొత్త నిర్ణయాల అమలు ప్రారంభించారు. భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేసారు.
నడక మార్గంలో కొత్త నిర్ణయాలు: చిరుత దాడిలో బాలిక మరణించటం పై టీటీడీ ఛైర్మన్ భూమన ఆవేదన వ్యక్తం చేసారు. జూన్ 22 వ తేదీ ఇలాంటి సంఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత చర్యలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్,టీటీడీ అధికారులు చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే టీటీడీ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని శ్రీ కరుణాకర్ రెడ్డి చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కుండా సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలనే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టీటీడీకి ముఖ్యమన్నారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
టీంలుగా భక్తుల అనుమతి: చిన్నారి మృతి ఘటనతో ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయాలు ప్రకటించారు. అందులో భాగంగా కాలినడకన వచ్చే భక్తులు వంద గాలిగోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు గుంపులు.. గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నారు. ముందు వెనుక రోప్ ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది సాయంతో పంపుతున్నారు.
కాలిబాట మార్గంలో కంచె ఏర్పాటుపై ఫారెస్ట్ అధికారులను నివేదిక ఇవ్వమని ఆదేశించామన్నారు. కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. నడక మార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి వేళ ద్విచక్ర వాహనాల నిలిపివేత: నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రెండు నడక మార్గాల్లోపారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసామని ఈవో చెప్పారు. నడకదారులలో మధ్యాహ్నం 2-3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాలపై సాధ్యా సాధ్యాలనుపరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
బాలిక లక్షిత కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. మృతురాలి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. టీటీడీ రూ 5 లక్షలు, అటవీ శాఖ రూ 5 లక్షలు కలిపి మొత్తం రూ 10 లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications