Tirumala: పారిశుధ్య పనుల్లో శ్రీవారి సేవకులు - చీపురు పట్టిన ఈవో, కలెక్టర్..!!
Tirumala: తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో, టీటీడీ అధికారులు..ఉద్యోగులు సహకరించేందుకు ముందుకు వచ్చారు. వీరితో పాటుగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించేందుకు పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీరితో కలిసి ఈవో ధర్మారెడ్డి పారుశుధ్య పనుల్లో పాల్గొన్నారు. నెలరోజుల పాటు అధికారులు, ఉద్యోగులు ఈ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారని ఈవో వెల్లడించారు.
పారిశుధ్య పనుల్లో సిబ్బంది:తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నందున, ఉద్యోగులు సహకరించాలని తాను కోరినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన 1600 మంది సులభ ఏజెన్సీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు టీటీడీ యాజమాన్యానికి తెలియజేయకుండా సమ్మెకు వెళ్లారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు కార్పొరేషన్లు , స్విమ్స్, బర్డ్ సంస్థల నుండి పారిశుద్ధ్య కార్మికులను సమీకరించి ఎనిమిది రోజులుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పారిశుధ్య చర్యలు చేపట్టిందని చెప్పారు. క్లిష్ట సమయంలో తమ సంస్థ ప్రతిష్ట కాపాడుతూ భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు ఉద్యోగులు ముందుకురావడం అభినందనీయమన్నారు.

ముందుకొచ్చిన శ్రీవారి సేవకులు:ఉద్యోగులు సంస్థను తమ సొంత ఇంటిలా భావించి పారిశుధ్య పనులకు ముందుకు వచ్చారన్నారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలవాలని ఆయన కోరారు. పారిశుధ్య కార్మికులు సమ్మె సమయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించేందుకు పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారని చెప్పారు. భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పారిశుధ్య పనుల్లో పాల్గొంటామని ఈవో స్పష్టం చేశారు. వీరందరికి ప్రతినెల మూడుసార్లు తిరుమలలో డ్యూటీలు వేయడం జరిగిందని చెప్పారు.
ఈవో, కలెక్టర్ సైతం :తిరుమలలోని సీఆర్ఓ వద్ద ఈవో ధర్మారెడ్డి పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటరమణా రెడ్డితో పాటుగా జేఈవోలు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. టీటీడీలోని 8 వేల నుండి 10 వేల మంది పర్మినెంట్, కార్పొరేషన్ ఉద్యోగులకు, ప్రతిరోజు 600 నుండి 700 మందికి తిరుమలలో డిప్యుటేషన్ డ్యూటీ వేసినట్లు తెలిపారు. వీరందరికి ప్రతినెల మూడుసార్లు తిరుమలలో డ్యూటీలు వేయడం జరిగిందని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇచ్చామని, వీరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి కార్మికులను సమీకరించి తీసుకొస్తున్నారని చెప్పారు. వీరికి కనీస వేతనాలు, అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, శ్రీవారి దర్శనం, సబ్సిడీపై లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications