శ్రీవారి లడ్డూపై టీటీడీ కొత్త నిర్ణయాలు
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల పెద్ద ఎత్తున రైలు సర్వీసులు రద్దు కావడం, అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడం, జనజీవనం స్తంభించిపోవడం.. వంటి కారణాలు భక్తుల రోజువారీ సంఖ్యపై ప్రభావాన్ని చూపాయి.
ఈ నెల 3, 4 తేదీల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 60 వేల లోపే ఉండటం దీనికి నిదర్శనం. 3వ తేదీన 57,817, 4వ తేదీన 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం నాడు ఈ సంఖ్య స్పల్పంగా పెరిగింది. 61,142 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వారిలో 21,525 మంది తలనీలాలను సమర్పించుకున్నారు.

ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. ఈ వారాంతంలో తిరుమలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదు.
శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించే విషయంలో టీటీడీ అధికారులు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తోన్నారు. ఇదివరకే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించారు.
కేఎంఎఫ్ నుంచి నందిని బ్రాండ్ నెయ్యిని కొనుగోలు చేశారు. నెయ్యితో కూడిన నందిని ట్యాంకర్లు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారని గుర్తు చేశారు. అందుకే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించినట్లు వివరించారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించడానికి సరైన ల్యాబొరెటరీ సౌకర్యం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా అత్యాధునిక ల్యాబొరెటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడానికి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు శ్యామలరావు. ఇందులో ఎన్డిఆర్ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని అన్నారు.
ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కొనుగోలు టెండర్లల్లో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశ నిర్ధేశం చేసిందని, వాటి మేరకు మార్పులు చేశామని శ్యామలరావు వివరించారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత, రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications