శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలలో వసతి కేటాయింపులో కీలక మార్పు..!!
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల కొండ పైన వసతి సౌకర్యాలను పెంచాలని నిర్ణయించింది. ఇందు కోసం ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన సత్రాలను తొలిగించి..వాటి స్థానంలో నూతన సముదాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ దిశగా కార్యచరణ సిద్దం అవుతోంది. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాల తో ఆధునాతన పద్దతుల్లో వీటిని నిర్మించనున్నారు. అదే సమయంలో కాటేజీల నిర్వహణ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజా నిర్ణయం అమలైతే తిరుమల కొండ పైన భక్తులకు వసతి విషయంలో సమస్యలు పరిష్కారం కానున్నాయి.

తిరుమలలో నూతన వసతి భవనాలు
తిరుమలలో 60 ఏళ్ల కాలంలో వినియోగంలో ఉన్న సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని టీటీడీ దాదాపు నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు ఉన్నాయి. అందులో 30 నుంచి 60 ఏళ్ల క్రితం నిర్మించినవి వినియోగిస్తున్నారు. వీటిలో పలు భవనాల్లో సమస్యలు గుర్తించారు. కాటేజీలకు రూ.కోట్ల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన సుదర్శన్, గోవర్థన్, కల్యాణి సత్రాలను కూడా దశలవారీగా మరమ్మతులు కొనసాగిస్తున్నారు. సుదర్శన్‌లో 386, గోవర్థన్‌లో 186, కళ్యాణిలో 260 గదులు ఉన్నాయి. వీటిని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు. నిత్యం వీటిలో సమస్యలు వస్తుండటంలో కొత్త నిర్మాణాలకు నిర్ణయించారు. ఒకసారి అన్నింటినీ తొలిగిస్తే భక్తులకు వసతి సమస్య కానుంది. దీంతో..దశల వారీగా వీటిని కూలగొట్టి కొత్త వాటిని నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

అధునాతన సౌకర్యాలతో నిర్మాణాలు
కొత్త కాటేజీల నిర్మాణాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించే వాటిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. రూ 50, రూ 100 గదులు కేటాయించే కాటేజీల్లో వేడి నీరు, పార్కింగ్, ఏసీ గదులు వంటి సౌకర్యాలు లేవు. కొత్తగా నిర్మించే ప్రతీ కాటేజీలోనూ కార్ ప్కారింగ్, కల్యాణకట్ట, ఏసీ, నాన్ ఏసీ గదులు, గీజర్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించనున్నారు. అదే విధంగా వసతి గదుల అద్దె విషయంలోనూ విమర్శలకు తావు లేకుండా చూడాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మించే కాటేజీల్లో సౌకర్యాలు పెంచినా..సామాన్య భక్తుల పైన భారం లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. గతంలో అద్దె పెంపు పైన వచ్చిన విమర్శలపైన అధికారులు స్పష్టత ఇచ్చారు.

దర్శనం - వసతి సులభతరం దిశగా
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనం..వసతి విషయంలో ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో ప్రస్తుతం 7500 గదులు, నాలుగు యాత్రిక సదన్‌లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50, 100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయి. వీటి అద్దె నాలుగు దశాబ్దాలుగా అవే కొనసాగుతున్నాయి. తిరుమలలో 120 కోట్ల రూపాయలతో పలు గదులను ఆధునీకరించామని.. 50, 100 రూపాయల గదులల్లో ఫ్లోరింగ్, గ్రీజర్లు వంటివి కల్పించారు. నారాయణగిరి, ఎస్వీ అతిధి గృహం, స్పెషల్ టైప్ అతిధి గృహాలు వీఐపీ కోటా కింద గదులు ఉంటాయని.. ఎంబీసీ కార్యాలయం కింద ఉన్న ఈ మూడు అతిధి గృహాలకు సంబంధించి గదుల ధరలను పెంచారు. మిగతా 50, 100 గదుల ధరలు పెంచే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు కొత్త కాటేజీల నిర్మాణం పూర్తయితే భక్తులకు మరింత మేలు జరగనుంది.












Click it and Unblock the Notifications