రేపటి నుంచి శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు - వీఐపీ దర్శనాలపై కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం మాడవీధుల్లో హనుమంత వాహనంపై శ్రీవేంకటాద్రి రాముని అవతారంలో శ్రీవారు కొలువుదీరి ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. రాత్రి బంకారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితతులు నిర్వహించారు. ఇక.. భక్తులకు శ్రీవారి దివ్య దర్శనం టోకెన్ల పై టీడీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
దివ్య దర్శనం టోకెన్ల జారీ
తిరుమలలో ఈ రోజు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. అదే విధంగా ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ఫణ చేసారు. ఏప్రిల్ 5న శ్రీసీతారామ కళ్యాణ్ నిర్వహించనున్నారు. ఇక..వేసవిలో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీతో టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా భక్తులు కోరుతున్న విధంగా నడకదారి భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీకి టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం ముందుగా వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి (ఏప్రిల్ 1) నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.

నిత్యం 15 వేల టోకెన్లు మంజూరు
రేపటి నుంచి అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వారం తరువాత ఈ టోకెన్ల జారీ పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. రానున్న మూడు నెలల పాటు తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 15 నుండి జులై 15వ తేదీ వరకు కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/ దర్శన టికెట్లు తగ్గించాలని నిర్ణయంచారు. ఈ మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరారు. దీని ద్వారా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుంది.
ఇదే సమయంలో వేసవి కారణంగా ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేయాలని నిర్ణయించారు. రద్దీ కారణంగా సామాన్య భక్తులకు వసతి కేటాయింపులో ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నామని టీటీడీ చెబుతోంది. తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకంగా కేటాయింపు జరుగుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దీంతో మూడు నెలల పాటు రద్దీ వేళ..టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications