తిరుమల గదుల కోటా నేడు విడుదల - శ్రీవారి పుష్కరిణి నెల రోజులు మూసివేత..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెప్టెంబర్ లో బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్దం అవుతోంది. ముందుగా నిర్ణయించిన కార్యాచరణ మేరకు కార్యక్రమాలు అమలు చేస్తోంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దర్శనం..సేవలు..వసతి గదుల కోటాను ముందుగానే టీటీడీ విడుదల చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి గదుల కోటాను ఈ రోజు విడుదల చేయనుంది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గదుల కోటా విడుదల:టీటీడీ ఇప్పటికే అక్టోబర్ నెలకు సంబంధించి సేవలు..దర్శనం ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసింది. వేసవిలో తగ్గించిన రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను నెలకు మరో నాలుగు వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఈ పెంచిన టికెట్ల కోటాను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సమయంలోనే తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబర్ నెలకు సంబంధించి గదుల కోటాను ఈ రోజు (జూలై 26) న విడదుల చేయనున్నారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.

శ్రీవారి పుష్కరిణి మూత:తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు.
నేడు పల్లవోత్సవం:మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ రోజు (జూలై 26) తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.












Click it and Unblock the Notifications