తిరుమల శ్రీవారికి జంట బ్రహ్మోత్సవాలు- తేదీలు వచ్చేశాయ్: కన్నుల పండువగా
తిరుపతి: ఈ సంవత్సరం అధికమాసం నడుస్తోంది. ఈ కారణంగా శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శతకోటి భక్తులకు కన్నులపండువగా ఈ జంట బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు మొదలు పెట్టింది కూడా. లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ జంట బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జేఈవో సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాలతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ సమావేశం ఏర్పాటైంది.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జంట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను వెల్లడించారు. సెప్టెంబర్ 18 నుంచి 26 తేదీల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారని, అందుకే నెలన్నర ముందుగానే ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించామని అన్నారు.
జిల్లా అధికార, పోలీసు యంత్రాంగంతో త్వరలోనే సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం ఉంటుంది. అదే రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తిరుమలను సందర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
22వ తేదీన గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథోత్సవం, 25వ తేదీన రథోత్సవం ఉంటుంది. 26వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం 10 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నట్లు ధర్మారెడ్డి చెప్పారు.
అదే విధంగా- అక్టోబర్ 15వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయి. 19వ తేదీన గరుడ వాహనం, 20వ తేదీన పుష్పక విమానం, 22వ తేదీన స్వర్ణరథం, 23వ తేదీన చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దేవీ శరన్నవరాత్రులతో కూడిన బ్రహ్మోత్సవం కావడం వల్ల మరోసారి లక్షల్లో భక్తులు తిరుమలకు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.
ఈ జంట బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోన్నామని ధర్మారెడ్డి చెప్పారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, సామాగ్రి, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని వివరించారు.












Click it and Unblock the Notifications