తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం: రూ. 300 టికెట్ రూ. 4.400కు విక్రయం
తిరుపతి: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. భక్తులకు నకిలీ టికెట్లను అంటగడుతున్న దళారులు దందాను అధికారులు గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన భక్తులకు దళారులు మార్ఫింగ్ చేసిన రెండు రూ.300 టికెట్లను రూ.4,400కు విక్రయించారు.
ప్రతిరోజూ కేటాయించిన రూ.300 దర్శనం కోటా టికెట్ల కంటే ఎక్కువ మంది రోజువారీగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), విజిలెన్స్ అధికారులు అనుమానం రావడంతో అధికారులు ఈ వ్యహరంపై నిఘా పటిష్ఠం చేశారు. అయితే, హైదరాబాద్ భక్తులు గురువారం శ్రీవారి దర్శనానికి రావడటంతో ఈ మొత్తం వ్యవహరం వెలుగోలోకి వచ్చింది. మార్ఫింగ్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఆగస్టు 13న గరుడ పంచమి
ఆగస్టు 13వ తేదీన గరుడ పంచమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు "గరుడపంచమి" పూజ చేస్తారని ప్రాశస్త్యం.
ఆగస్టు 22న మరోసారి గరుడ సేవ
ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో మనగుడి ఆగస్టు 20న
వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ కార్యక్రమాలు చేపడతారు.
ఆగస్టు 20న ఆయా ఆలయాల్లో అర్చకుల చేత వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగస్టు 21 ఆలయాల్లో భజన కార్యక్రమం చేపడతారు. ఆగస్టు 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా పండితుల చేత ధార్మికోపన్యాసం, భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమినాడు ఆయా ఆలయాల్లో గోపూజ, ఉట్టి ఉత్సవం జరుపుతారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే దర్శనాలు కల్పిస్తున్నారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో భక్తుల పరిమితిని పెంచుతున్నారు.












Click it and Unblock the Notifications