పంచాయతీ ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ పక్కా స్కెచ్: సొంత కులం ఓటుబ్యాంకుపై ఫోకస్: త్వరలో భేటీ
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో.. జగన్ సర్కార్ ఆ దిశగా దృష్టి సారించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ-జనసేన కూటమి.. క్షేత్రస్థాయిలో వ్యూహాలను రూపొందించుకునే పనిలో పడ్డాయి. తాము మద్దతు ఇవ్వబోయే అభ్యర్థులు విజయం సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనున్నాయి. ఏకగ్రీవాల కోసం కసరత్తు సాగిస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు

కాపు నేతలతో..
ఈ పరిస్థితుల మధ్య జనసేన పార్టీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తన సొంత సామాజిక వర్గం ఓటుబ్యాంకుపై దృష్టి సారించారు. బలమైన ఓటుబ్యాంకుగా ఉంటూ వస్తోన్న కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపు మళ్లించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆయన కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశం కానున్నారు. అటు కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటూ వచ్చిన కాపు ఓటుబ్యాంకు.. ప్రస్తుతం వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపిందనడానికి 2019 నాటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.

జనసేన వైపు మళ్లేలా..
మెజారిటీ కాపు సామాజిక వర్గ ఓటర్లు వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. కాపులు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారనేది ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈ సారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి కాపు సామాజిక వర్గ ఓటుబ్యాంకుపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. కాపులు ఎదుర్కొంటోన్న సమస్యలు, ఇతరత్రా అంశాలపై చర్చించడానికి ఆయన ఆ సామాజిక వర్గ నాయకులు, అదే కులానికి చెందిన వేర్వేరు సంఘాల ప్రతినిధులతో భేటీ కాబోతోన్నారు.

ముద్రగడ సహా
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సహా పలువురితో ఆయన భేటీ అవుతారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఇదివరకు పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలోని అంశాలే ప్రధాన అజెండాగా.. ఈ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ నిధుల కేటాయింపు, నిధుల మళ్లింపు, ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణాలకు రిజర్వేషన్ కల్పిొంచడం వంటి అంశాలను ఈ అజెండాలో చేర్చుతారని సమాచారం.
బీజేపీ-జనసేన జాయింట్ యాక్షన్..
వచ్చేనెల 9వ తేదీ నుంచి నాలుగు దశల్లో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించాలనే పట్టుదలను జనసేన కనపరుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీతో కలిసి ఉమ్మడిగా పోటీ చేయనున్న జనసేన.. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఆయా జిల్లాల్లో మెజారిటీ సంఖ్యలో పంచాయతీలను గెలుచుకోవడంతో పాటు ఇతర జిల్లాల్లో అధికార పార్టీకి గట్టిపోటీనిచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని అంటున్నారు.