స్వర్ణంతో మెరిసిన విజయవాడ అమ్మాయి: ఉత్కంఠ పోరులో..!!
విజయవాడ: చైనాలో హాంగ్ఝౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో మరోసారి తెలుగు జెండా ఎగిరింది. తెలుగు తేజం, విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం (Jyoti Surekha Vennam) సంచలనం సృష్టించారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో సత్తా చాటారు. ఈ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించారు.
అటు- ఆసియా గేమ్స్‌లో మొత్తంగా వంద పతకాల మైలురాయిని అందుకుంది భారత్. ఇందులో స్వర్ణం- 25, వెండి- 35, కాంస్య పతకాలు- 40 ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. క్రికెట్ సహా పలు ఈవెంట్లల్లో ఇంకా భారత ప్లేయర్లు, అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండటం వల్ల మరిన్ని పతకాలను భారత్‌కు దక్కుతాయనడంలో సందేహాలు అక్కర్లేదు.

మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన అర్చరీ చెవాన్‌సోపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 149-145 పాయింట్ల తేడాతో చెవాన్‌ను మట్టికరిపించారు. మొదటి రౌండ్ నుంచీ వారిద్దరి మధ్య పోటాపోటీగా పోరు సాగింది. మూడు రౌండ్ల తరువాత ఇద్దరూ దాదాపుగా సమవుజ్జీగా నిలిచారు. జ్యోతి సురేఖ- 89, చెవాన్- 87 పాయింట్లను సాధించారు.
ఇదే పోరు చివరి రౌండ్ వరకూ కొనసాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. గేమ్ చివరి రౌండ్‌కు వచ్చే సమయానికి రెండు పాయింట్లతో మాత్రమే ఆధిక్యతలో కనిపించారు జ్యోతి సురేఖ. ఆమె ఖాతాలో 142, చెవాన్ సో- 140 పాయింట్లతో నిలిచారు. చివరి రౌండ్‌లో మాత్రం జ్యోతి సురేఖ ఆధిపత్యం స్పష్టంగా కొనసాగింది.
ఒకేసారి నాలుగు పాయింట్లను సాధించారు. తన స్కోరును 146కు పెంచుకోగలిగారు. అక్కడే చెవాన్ సో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడ్డారు. చివరి రౌండ్‌లో తన పాయింట్లను పెంచుకోలేకపోయారు. 140 వద్దే నిలిచారు. దీనితో 146-140 పాయింట్ల తేడాతో జ్యోతి సురేఖకు స్వర్ణ పతకం లభించింది.












Click it and Unblock the Notifications