పిరికితనమే: శిద్దా రాఘవరావు పార్టీ మార్పుపై చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితుడుగా పేరు సంపాదించుకున్న మాజీ మాంత్రి శిద్దా రాఘవరావు అధికార పార్టీలో చేరడంపై స్పందించారు. టీడీపీకి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలతో చంద్రబాబు బుధవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బెదిరింపులు, ప్రలోభాలతో తమ పార్టీ వారిని అధికార వైసీపీ లోబర్చుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు. టీడీపీలో కొందరు దశాబ్దాలుగా పదవులు పొంది.. ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీని వీడటం పిరికితనమే అవుతుందని అన్నారు.

టీడీపీ నుంచి ఒకరు పోతే వందమంది తయారు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పార్టీని వీడినా ఏమీ కాదని.. పార్టీ మారినవారు కనుమరుగైపోయారని చంద్రబాబు అన్నారు.
కాగా, బుధవారం టీడీపీ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తన కుమారుడితోపాటు రాఘవరావు వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. పేద ప్రజల కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.












Click it and Unblock the Notifications