టీడీపీ గుట్టు రట్టు చేసిన కేశినేని శ్వేత: పోటీకి అభ్యర్థులే లేరు: అంతా లోకేష్ వల్లే..
Kesineni Swetha: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది.
కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తడం దీనికి నిదర్శనం. ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటికి తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

తాజాగా విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులే లేరని, వాటిపై దృష్టి పెట్టకుండా తమ కుటుంబాన్ని వేధించడానికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. సిట్టింగ్ ఎంపీ అయిన తన తండ్రి కేశినేని నానిని అవమానించారని అన్నారు.
విజయవాడ చుట్టుపక్కల ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీలో ఉందని కేశినేని శ్వేత చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ సారి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారామె. రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులే లేరని వివరించారు.

ఇవన్నీ వదిలేసి విజయవాడ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోన్నారని శ్వేత ప్రశ్నించారు. సంవత్సర కాలంగా చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ తమ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికీ పిలవకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరువూరు సభ నిర్వహణ విషయంలో కేశినేని నాని ఎందుకు జోక్యం చేసుకుంటోన్నాడంటూ స్వయంగా నారా లోకేష్ ప్రశ్నించాడని, ఒక సిట్టింగ్ ఎంపీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ నిలదీశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది తమ అభిమానులు, అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని శ్వేత తెలిపారు.












Click it and Unblock the Notifications