ఏపీలో మతమార్పిడులు తప్ప జగన్ లో మార్పు లేదు.. బీజేపీ నేత కన్నా తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా ఏపీలో మతమార్పిడులపై విరుచుకుపడ్డారు.

ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేమీ జరగడంలేదన్న కన్నా లక్ష్మీ నారాయణ
సీఎం జగన్ పై కన్నా లక్ష్మీనారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేమీ జరగడంలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం హిందువులకు పూర్తి వ్యతిరేకమని కన్నా ఆరోపణలు గుప్పించారు . హిందూ దేవాలయాల్లో అరాచకాలు జరుగుతున్నాయని, అలా జరగటానికి వీల్లేదని చెప్తే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెబితే ఆయన్ను తొలగించారు తప్ప జగన్ లో మార్పు రాలేదని కన్నా అన్నారు.

అనుభవంలేని వ్యక్తి సీఎంగా రావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం
ఏమాత్రం అనుభవంలేని వ్యక్తి సీఎంగా రావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు .తిరుపతి సహా అనేక హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు తిష్ట వేసి ఇష్టారాజ్యంగా మత ప్రచారం సాగిస్తున్నారని, గతంలో గుట్టుగా సాగిన మతమార్పిళ్లు నేడు జగన్ మద్దతు కారణంగా బహిరంగంగా సాగుతున్నాయని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. చివరికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చారని కన్నా వ్యాఖ్యానించారు.

తెలుగును చంపాలని చూస్తున్న జగన్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే
అంతే కాదు ఏపీలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు మీడియం తీసివేయ్యలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.. తెలుగు భాషకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందని, ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఈస్థితికి చేరుకున్న తెలుగును చంపాలని చూస్తున్న జగన్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని కన్నా మండిపడ్డారు .

మత మార్పిళ్లు అంశం ప్రధాన అస్త్రంగా జగన్ పై ఆగ్రహం
మాతృభాషను చంపడం అంటే కన్నతల్లిని చంపుకోవడమేనని కన్నా లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు.ఏది ఏమైనా మత మార్పిళ్లు ఏపీలో విపరీతంగా పెరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇది ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.












Click it and Unblock the Notifications