భవానీ దీక్షల విరమణకు రావొద్దు-దర్శనం మాత్రమే-బెజవాడ దుర్గగుడి అధికారుల కీలక ప్రకటన
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఏటా సాగే భవానీ మాలల విరమణ కార్యక్రమంపై ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల్ని ఈ ఏడాది మాలల విరమణకు రావొద్దని సూచించారు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి వస్తున్న లక్షలాది భవానీ మాలధారులంతా షాక్ కు గురవుతున్నారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా లక్షలాది మంది భవానీ దీక్షల విరమణకు వస్తున్నారని తమకు సమాచారం వచ్చిందని దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. 14 నుంచి 17 తేదీల మధ్యలో ఆలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిందన్నారు. అయితే ఈ ఏడాది ఇరుముడి ప్రాంగణం దేవాలయంలో ఈసారి లేదు కాబట్టి భావానిలు వారి వారి ప్రాంతాల్లో మాల విరమణ కార్యక్రమం చేసుకోవాలని ఆయన సూచించారు భవానీల రాకకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసామని, సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన, క్యూ లైన్ లలో ఏర్పాట్లు చేస్తున్నామని సోమి నాయుడు వెల్లడించారు.

భవానీలకు దర్శనం అయ్యాక మళ్ళీ కనకదుర్గ నగర్ మీదుగా భవానీలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భవానీలంతా ఆలయ నిర్ణయానికి సహకారం అందించాలని కోరారు. దుర్గమ్మ మాల వేసుకున్న భవానీల ఇరుముళ్ల కార్యక్రమానికి ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై అనుమతి లేదని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. దీనిపై ఇప్పటికే గురు భవానీల తో చర్చించామన్నారు. కానుకలు ఏమైనా ఉంటే తర్వాత వచ్చి హుండీలో వేసుకోవాలని, లేదా ఆన్లైన్ లో చెల్లించవచ్చని ఆమె సూచించారు. మూల నక్షత్రం రోజు దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకూ భక్తులు వచ్చినట్లు తెలిపారు.
ప్రతీ ఏటా 6 రాష్ట్రాల నుంచి 25 లక్షల మంది వరకూ భవానీ మాల వేసుకుంటారు. ప్రతి సంవత్సరం దుర్గ గుడి వద్ద దీక్ష విరమణలు చేపడుతుంటారు. కరోనా కారణంగా ప్రస్తుతం దుర్గ గుడి వద్ద దీక్షల విరమణ నిలుపుదల చేయడంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయ అధికారులు, పాలకమండలి నిర్ణయాన్ని గౌరవిస్తూ భవానీల రాకను నిలుపుదల చేస్తున్ననట్లు గురు భవానీలు చెప్తున్నారు. గురు భవానీలకు ముందుగానే సమాచారం పంపినట్లు వారు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భావానిలు వచ్చి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముల్లు వారి వారి ప్రాంతాల్లో విరమణ చేసుకోవాలని గురు భవానీలకు సూచిస్తున్నారు. కానుకలు ఏమైనా ఉంటే తర్వాత వచ్చి హుండీలో వేయాలి, లేదా ఆన్లైన్ లో చెల్లించవచ్చన్నారు. భవానీలు అంతా కూడా దీనికి సహకరించాలని ఆలయ అధికారులు చెప్తున్నారు.