కల్తీ అక్రమార్కులకు కఠిన శిక్షలు : జీవిత ఖైదు తప్పదు
ఆహార పదార్థాల్ని కల్తీచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు ఇక కఠిన శిక్షలు విధించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది.ఇక, వీరి ఆగడాలను ఉపేక్షించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కల్తీరాయుళ్లకు జీవితఖైదు విధించేందుకు వీలుగా చట్ట సవరణకు సిద్ధమవుతోంది. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తరహాలోనే ఐపీసీ సెక్షన్లకు సవరణలు తెచ్చి కఠిన శిక్షలను అమల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం ప్రధానంగా ఆహార కల్తీ నియంత్రణపై దృష్టిసారించింది. గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రాంగణాల్లో తనిఖీలు చేసింది. ప్రధానంగా టీ పొడి, వాటర్ ప్లాంట్‌లు, పసుపు, బెల్లం, నెయ్యి, ఖర్జూరం, చిరుపదార్థాలు, వంటనూనెల్లో ఎలా కల్తీకి పాల్పడుతున్నారో ఈ సోదాల్లో గుర్తించారు. విష పూరితమైన పదార్ధాలతో పాటుగా ఆకర్షణ కోసం వాడుతున్న పదార్ధాలు ఆరోగ్యానికి హాని కలిగించేవిగా గుర్తించారు. దీంతో..ఇప్పటి వరకు ఇటువంటి వారి పైఅమలవుతున్న శిక్షలు..ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారనే అంశం పై ఏపి విజిలెన్స్ శాఖ అధ్యయనం చేసింది. ఆహార కల్తీ నియంత్రణ విషయంలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఐపీసీలోని 272, 273, 274, 275, 276 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేలా చట్టసవరణ చేశాయి. కేవలం జరిమానాలతోనే సరిపెట్టేయకుండా దోషులకు జీవితఖైదు విధించేలా సవరణలు తీసుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 1975 నుంచి, పశ్చిమబెంగాల్‌లో 1973 నుంచి, ఒడిశాలో 1999 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ రాష్ట్రాల తరహాలోనే చట్ట సవరణలు చేయడానికి మహారాష్ట్ర కూడా తాజాగా ముందుకొచ్చింది. దీంతో...ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చిన తరువాత కల్తీ అక్రమార్కుల వ్యవహారాలు తగ్గు ముఖం పట్టాయి. దీంతో..ఏపిలోనూ చట్ట సవరణ దిశగా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం సురక్షితం కానివిగా తేలిన నమూనాలకు సంబంధించిన కేసుల్లో గరిష్ఠంగా ఆరేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకూ జరిమానా, నాసిరకం, నకిలీవిగా తేలిన నమూనాలకు సంబంధించిన కేసుల్లో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకూ జరిమానా విధించేందుకు మాత్రమే ఇప్పటి వరకు అవకాశం ఉంది.అయితే, విజిలెన్స్ శాఖ ప్రతిపాదించనట్లుగా సవరణ జరిగితే...తొలుత నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తారు. అప్పటకీ మార్పు రాకుంటే..జీవితఖైదు విధిస్తారు. ఈ సవరణ ల పై వచ్చే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications