గుడివాడ వెళుతున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయన ఈ పర్యటనలు చేయడం కొత్తేమీకాదు.. ప్రత్యేకంగా వార్తల్లో నిలిచే అంశం కూడా కాదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా వార్తల్లో నిలవబోతోంది. ఎందుకంటే ఆయన త్వరలోనే గుడివాడ, మచిలీపట్నం లో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈవార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొడాలి నానిని ఓడించాలని..
గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని తరుచుగా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతుంటారు. ఎవరెన్నిరకాలుగా చెప్పినా ఆయన తన తీరు మార్చుకోలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో కొడాలి నాని అంటే ఒక కసి ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కొడాలిని ఓడించాలనే పట్టుదలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులంతా కోరుకుంటున్నాయి. అంత స్థాయిలో కొడాలి నాని ఫేమస్ అయ్యారు.

రాత్రికి మచిలీపట్నంలో బస
బాదుడే బాదుడుతోపాటు ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు గుడివాడ, మచిలీపట్నం రానున్నారు. రాత్రికి మచిలీపట్నంలో బస చేస్తారు. బందరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యంగా మాట్లాడుతూ చంద్రబాబుపై, పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు రువ్వేవారు. దీంతో ఈ నానీలిద్దరూ టీడీపీకి టార్గెట్ గా మారారు. ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ తేదీన రాబోతున్నారు అనేది ఇంకా ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే, రెండు వారాల్లో ఉండొచ్చని కొల్లు అన్నారు.

వర్షాల వల్ల రద్దయిన మినీ మహానాడు
చంద్రబాబు గుడివాడ, మచిలీపట్నం వస్తున్నారంటే కచ్చితంగా కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ చంద్రబాబు, లోకేష్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారు. అప్పుడు దానికి సరైనరీతిలో బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ లోనే గుడివాడలో మినీ మహానాడు నిర్వహించాల్సి ఉంది. వర్షాల కారణంగా అది రద్దైంది. మళ్లీ ఏర్పాటు చేయాలంటూ ఇక్కడి పార్టీ శ్రేణులు చంద్రబాబును కోరుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పర్యటన ఎన్ని మలుపులకు కారణమవుతుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.